స్టాక్ మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతోంది. వృద్ధికి ఊతమందించే దిశగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తున్న ప్రోత్సాహకాలతో భారీ లాభాల దిశగా ట్రేడవుతున్నాయి సూచీలు. సెన్సెక్స్ ఏకంగా 1800 పాయింట్లకు పైగా పెరిగింది. నిఫ్టీ 500 పాయింట్లకు పైగా లాభపడింది.
భారీ నష్టాల నుంచి తేరుకున్న స్టాక్ మార్కెట్లు ఒక్క సారిగా.. అత్యధిక లాభాల దిశగా ట్రేడవుతున్నాయి. ఆర్థిక మాంద్యం అంచనాల నేపథ్యంలో తయారీ, ఆర్థిక రంగాలకు ప్రోత్సాహకాలు, కార్పొరేట్ సుంకం తగ్గింపు వంటి ఉద్దీపనలు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో భారీ లాభాల దిశగా పయనిస్తున్నాయి స్టాక్ మార్కెట్లు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ఏకంగా 1820 పాయింట్లు బలపడి... ప్రస్తుతం 37,913 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 533 పాయింట్ల లాభంతో 11,238 వద్ద కొనసాగుతోంది.
స్టాక్ మార్కెట్ల పరుగుతో.. రూపాయి 66 పైసలు బలపడింది. డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం 70.68 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివివే..
మారుతీ, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్, హీరోమోటార్స్, ఎస్ బ్యాంకు, ఎల్&టీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
రూపాయి వృద్ధితో ఐటీ రంగం స్వల్పంగా నష్టాల్లో ట్రేడవుతోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.