కరోనా భూతం మార్కెట్లను మరోమారు కుదిపేసింది. ఆర్థిక మాంద్యం తప్పదన్న అంచనా... మదుపర్లను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. ఉద్దీపన ప్యాకేజీలతో ప్రగతి రథానికి ఊతమిస్తామన్న వేర్వేరు దేశాల ప్రకటనల పరంపర పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపలేకపోయింది. ఫలితం... దేశీయ స్టాక్ మార్కెట్లకు మరోమారు భారీ నష్టం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1,710 పాయింట్లు కోల్పోయి 28 వేల 870 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 498 పాయింట్లు పతనమై 8 వేల 469 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా...
ఉదయం 30 వేల 969 వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది సెన్సెక్స్. ఓ దశలో 31 వేల 102 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. అయితే ఈ లాభాల జోరు ఎంతో సేపు కొనసాగలేదు.
ఆర్థిక మాంద్యం తప్పదన్న ఆందోళనలు పెరగడం మదుపర్లు అమ్మకాలకు దిగేందుకు కారణమైంది. భారత దేశ ఆర్థిక వృద్ధి అంచనాలను ఎస్ అండ్ పీ రేటింగ్స్ సంస్థ తగ్గించడం మరింత ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా సెన్సెక్స్ 30 వేల మార్కు దిగువకు పతనమైంది. ఓ దశలో 28 వేల 613 పాయింట్ల కనిష్ఠస్థాయికి దిగజారింది. చివరకు 28 వేల 870 వద్ద ముగిసింది.