స్టాక్ మార్కెట్లలో బేర్ స్వైరవిహారం ఐదో రోజూ కొనసాగింది. గురువారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 535 పాయింట్లు తగ్గి 46,874 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 150 పాయింట్లు కోల్పోయి 13,817 వద్ద స్థిరపడింది.
గురువారంతో జనవరి డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపు కారణంగా విక్రయాలు వెల్లువెత్తాయి. ప్రత్యేక పరిస్థితుల నడుమ ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై వస్తున్న అంచనాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటించారు. మరోవైపు ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లన్నీ గురువారం సెషన్లో కుప్పకూలాయి. ఈ అంశాలన్నీ దేశీయ మార్కెట్ల నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 47,172 పాయింట్ల అత్యధిక స్థాయి, 46,518 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 13,898 పాయింట్ల గరిష్ఠ స్థాయి 13,713 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి.
హెచ్‌యూఎల్, మారుతీ, హెచ్‌సీఎల్‌టెక్, పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన.. షాంఘై, టోక్యో సియోల్, హాంకాంగ్ సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి.
ఇదీ చూడండి:రికార్డుస్థాయికి యాపిల్ ఆదాయం- భారత్‌లో భళా