స్టాక్ మార్కట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఆరంభం నుంచే ఆటుపోట్లు ఎదుర్కొన్న సూచీలు సెషన్ మొత్తం అదే ధోరణిని కనబర్చాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 97 పాయింట్లు తగ్గి 33,508 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 33 పాయింట్లు కోల్పోయి 9,981 వద్ద స్థిరపడింది.
భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటించారు. ఇరు దేశాలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయోనన్న విషయంపై స్పష్టతలేదు. వీటికి తోడు ఆసియాలో ఇతర మార్కెట్లు మిశ్రమంగా స్పందించడం బుధవారం నష్టాలకు కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతుండటం కూడా నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 33,934 పాయింట్ల అత్యధిక స్థాయి.. 33,333 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 10,003 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 9,834 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
మారుతీ, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాలను గడించాయి.
కోటక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, ఎం&ఎం, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, హీరో మోటోకార్ప్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
రూపాయి..
కరెన్సీ మార్కెట్లో రూపాయి బుధవారం స్వల్పంగా 4 పైసలు బలపడింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ రూ.76.16 వద్ద స్థిరపడింది.