సౌదీ ఆరాంకో ఛైర్మన్ యాసిర్ అల్-రుమయ్యన్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) బోర్డ్‌లో చేరనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్ఐఎల్లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఒప్పందం ద్వారా ఇది సాధ్యమవచ్చని తెలుస్తోంది. జూన్ 24న జరగనున్న ఆర్ఐఎల్ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)కు ముందే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఆరాంకో ఒప్పందంపై ప్రకటన 2019లోనే..
ఆయిల్-కెమికల్స్ (ఓ2సీ)వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ ఆరాంకోకు విక్రయించనున్నట్లు ముకేశ్ అంబానీ 2019లోనే ప్రకటించారు. ఇరు సంస్థల మధ్య మార్చి 2020 కల్లా ఒప్పందం జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా అది ఆగిపోయింది. అయితే.. ఇరు కంపెనీలు ఈ విషయంపై ఇటీవల మళ్లీ చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది.
ఆర్ఐఎల్ డిజిటల్, రీటైల్ వ్యాపారంలో గత ఏడాది కొత్త వాటాదారులు చేరారు. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో ఆ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సంస్థలకు త్వరలోనే ఆర్ఐఎల్ మార్గదర్శకాలను ఇస్తుందని అంచనాలు ఉన్నాయి. ఏజీఎంలోనే జియో గూగుల్ ఫోన్ (5జీ), జియో మార్ట్ - వాట్సప్ ఇంటిగ్రేషన్‌పై స్పష్టత రానుంది.
ఏజీఎంకు ప్రత్యేకత..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం అంటే వాటాదారులతో పాటు సాధారణ ప్రజలకు కూడా భారీ అంచనాలు ఉంటాయి. రిలయన్స్ జియో వంటి సంచలన నిర్ణయాన్ని ఏజీఎంలోనే ప్రకటించింది కంపెనీ. కరోనా వల్ల గత ఏడాది వర్చువల్‌గా ఏజీఎం నిర్వహించింది ఆర్ఐఎల్. దీనిని దాదాపు 3 లక్షల మంది వీక్షించారు. 2019లో ప్రత్యక్షంగా జరిగిన ఏజీఎంలో 3,000 మంది వాటాదారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: