కొవిడ్-19 పరిస్థితుల కారణంగా మార్కెట్లో సందడి చేయాల్సిన స్మార్ట్‌ఫోన్‌లకు తయారీ దశలోనే ఆగిపోయాయి. తాజాగా లాక్‌డౌన్ నిబంధనలు సడలించినందున మొబైల్ కంపెనీలు వరుసగా తమ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మొబైల్ మార్కెట్ అయిన భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఇటీవల జోరందుకున్నాయి. దీంతో శాంసంగ్, రియల్‌మీ కంపెనీలు కొత్త మోడల్ ఫోన్లను భారత మార్కెట్లోకి తీసుకురానున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41
కెమెరా ప్రాధాన్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్ ఫోన్లను భారత్‌లో తీసుకురానుంది. ఈ సిరీస్‌లో మొదటగా గెలాక్స్ ఎఫ్41 మోడల్‌ని వచ్చే నెలలో మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో గెలాక్సీ ఎఫ్41 ఫీచర్స్ ఇవేనంటూ నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. గెలాక్సీ ఎం31 తరహాలోనే ఇందులో కూడా 6.4 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారట. సెల్ఫీ కెమెరా కోసం డిస్‌ప్లేపై టియర్ డ్రాప్ స్టైల్ చేసినట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ యూఐ 2.0 ఓఎస్‌తో ఇది పనిచేస్తుందట. శాంసంగ్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనక 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్‌తో పాటు, 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారని సమాచారం. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6జీబీ ర్యామ్/128జీబీ ఇంటర్నల్ మెమరీ వేరియంట్‌లో ఈ మోడల్‌ని పరిచయం చేయనున్నారు. ఆన్‌లైన్ మార్కెట్ లక్ష్యంగా తీసుకొస్తున్న ఈ ఫోన్ ధర రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా.
రియల్‌మీ 7ఐ
ఇప్పటికే భారత మార్కెట్లో రియల్‌మీ 7, 7 ప్రో ఫోన్లు సందడి చేస్తున్నాయి. ఈ సిరీస్‌లోనే రియల్‌మీ 7ఐ పేరుతో కొత్త మొబైల్ ఫోన్‌ని తీసుకొస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఓఎస్‌తో ఇది పనిచేస్తుంది. మొత్తం ఐదు కెమెరాలు ఉన్నాయి. వెనక వైపు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో పాటు 8 ఎంపీ కెమెరా, 2ఎంపీ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8జీబీ ర్యామ్/128జీబీ వేరియంట్‌లో 7ఐ లభించనుంది. గురువారం ఇండోనేషియాలో ఈ ఫోన్‌ను విడుదల చేస్తున్నారు. భారత మార్కెట్లో విడుదల తేదీపై కంపెనీ ప్రకటన చేయాల్సి ఉంది.
ఇదీ చదవండి: మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ కొత్త మోడల్- ఫీచర్లు ఇవే