కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ ఆత్మహత్య అనంతరం కంపెనీ ఖాతాల్లో కనీసం రూ.2,000 కోట్ల మేర మాయం అయినట్లు ఓ దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఈ వ్యవహారాలతో సంబంధమున్న వ్యక్తులు తెలిపారు.
జులైలో సిద్ధార్థ ఆత్మహత్య తర్వాత నెలల తరబడి జరిగిన దర్యాప్తులో కాఫీ డే ఖాతాల్లోని ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. డజన్ల కొద్దీ ప్రైవేటు కంపెనీలతో జరిగిన లావాదేవీలు అందులో ఉన్నాయి. వంద పేజీలున్న ఒక ముసాయిదా నివేదిక ప్రకారం.. 270 మిలియన్ డాలర్ల మేర అదృశ్యమైనట్లు ఆ వ్యక్తులు తెలిపారు. నివేదిక తుది దశలో ఉందని.. ఈ వారంలోనే విడుదలయ్యేందుకు అవకాశం ఉందంటున్నారు. అయితే దర్యాప్తు ఇంకా జరుగుతున్నందున తుది నివేదికలో మార్పులుండొచ్చని భావిస్తున్నారు.
కంపెనీ స్పందన ఇది..
‘నివేదిక ఇంకా రాలేదు.. బోర్డు డైరెక్టర్లకు అందులో ఏముందో ఇంకా తెలియదు. కాబట్టి దీనిపై ఇపుడే ఏమీ మాట్లాడలేమ’ని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. గతేడాది ఉన్నట్లుండి అదృశ్యమై.. శవమై లభించిన సిద్ధార్థ మరణం యావత్ భారత వ్యాపార వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. జరిగిన అన్ని లావాదేవీలకు తనే కారణమంటూ ఉద్యోగులకు రాసిన లేఖలో మరణానికి ముందు సిద్ధార్థ తెలిపిన విషయం తెలిసిందే. ఆయన చనిపోయిన నెల తర్వాత పదవీ విరమణ చేసిన సీనియర్ అధికారి అశోక్‌కుమార్ మల్హోత్రా ఆధ్వర్యంలో దర్యాప్తు మొదలైన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: అమ్ముడుపోని బీఎస్-4 వాహనాల పరిస్థితి ఏంటి?