రుణ రహిత కంపెనీగా అవతరించాలనే లక్ష్యాన్ని సమర్థంగా పూర్తి చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్).. ఇక నుంచి జియో, రిటైల్ విభాగాల పబ్లిక్ ఇష్యూలపై దృష్టి సారించే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 24.7 శాతం వాటా విక్రయం ద్వారా రూ.1.15 లక్షల కోట్లు, రైట్స్ ఇష్యూ ద్వారా రూ.53,124 కోట్లను ఆర్‌ఐఎల్ సమీకరించిన సంగతి తెలిసిందే.
"ఈ లావాదేవీల ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ పూర్తిగా రుణ రహితంగా మారింది. జియో, రిటైల్ వ్యాపారాల ఐపీఓల ద్వారా రాబోయే మూడు నాలుగేళ్లలో కంపెనీలో వ్యాపారాల విభజన చోటుచేసుకునే అవకాశం ఉంది. దీంతో వాటాదార్ల విలువ మరింత పెరుగుతుంది."
- బెర్న్‌స్టీన్ రీసెర్చ్
15 బిలియన్ డాలర్ల అరామ్‌కో ఒప్పంద లావాదేవీ, మిగులు నగదు నిల్వలతో వచ్చే కొన్ని ఏళ్లలో ఈక్వీటీ- నికర రుణ నిష్పత్తి 2020-21 నాటి కంటే పడిపోవచ్చని బెర్న్‌స్టీన్ రీసెర్చ్ తెలిపింది. చమురు- రసాయనాల వ్యాపారంలో వాటా విక్రయం నిమిత్తం సౌదీ అరామ్‌కోతో ఆర్‌ఐఎల్ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్న విషయం విదితమే. 'ఆర్‌ఐఎల్ ఈ గణనీయ నిధుల నిల్వలతో ఏం చేస్తుందన్నదే ఇప్పుడు కీలకం. ప్రస్తుతమైతే బ్యాలెన్స్ షీట్ల పటిష్ఠం చేసుకునే నిమిత్తం ఇతరత్రా రుణ బకాయిలను తగ్గించుకునేందుకు, కేటాయింపులకు ప్రాధాన్యం ఇస్తుందని అనుకుంటున్నామ'ని నివేదిక పేర్కొంది.
ఇంటర్నెట్, రిటైల్ వ్యాపార విస్తరణలతో విలీనాలు కొనుగోళ్ల ద్వారా మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని బెర్న్‌స్టీన్ రీసెర్చ్ అభిప్రాయపడింది. అరామ్‌కో భాగస్వామ్యంలో రిఫైనింగ్, పెట్రో రసాయాల వ్యాపారంలోనూ విస్తరణ చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపింది. 2020-21లో ఆర్‌ఐఎల్ ఎబిటా రూ.86,000 కోట్లుగా నమోదుకావచ్చని బెర్న్‌స్టీన్ రీసెర్చ్ అంచనా వేసింది. కొన్నేళ్లక్రితంతో పోలిస్తే ఇది రెట్టింపు అని పేర్కొంది. మళ్లీ 2024-25 నాటికల్లా ఎబిటా ఇప్పుడున్నదానికి రెట్టింపు అవుతుందని భావిస్తున్నామని తెలిపింది. ఇంధన సంబంధిత వ్యాపార ఆదాయాలు స్తబ్దుగా ఉన్నప్పటికీ, జియో, కొత్త వ్యాపారాల వృద్ధి ఇందుకు దోహదం చేస్తుందని పేర్కొంది. షేరు లక్ష్యాన్ని రూ.1,720 నుంచి రూ.1,870కి పెంచుతున్నట్లు తెలిపింది.
5జీ నెట్‌వర్క్ వ్యవస్థ అభివృద్ధిలో జియో కీలక పాత్ర
భారత్‌లో 5జీ నెట్‌వర్క్ వ్యవస్థ అభివృద్ధిలో జియో కీలక పాత్ర పోషిస్తుందని వార్షిక నివేదికలో ఆర్‌ఐఎల్ పేర్కొంది. 5జీ నెట్‌వర్క్‌కు కంపెనీ చేసుకుంటున్న సన్నాహాలు, విస్తృత ఫైబర్ ఆస్తులు ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొంది. 'భారత్‌లో ఇంకా 2జీ ఫోనును వాడే వినియోగదారులు లక్షల సంఖల్లో ఉన్నారు. వీళ్లు ఇంటర్నెట్ వాడటం లేదు. అందువల్ల వీళ్లందరినీ 2జీ నుంచి 4జీ ఫోన్లకు తక్షణం మార్చాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో జియోకు అపార అవకాశాలు ఉన్నాయ'ని వాటాదార్లకు రాసిన లేఖలో ఆర్‌ఐఎల్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు.సాంకేతికత అభివృద్ధిలో జియో విజయవంతమైన తీరు అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాలను ఆకర్షించిందని వెల్లడించారు. అందుకే ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ సంస్థలు తమతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని పేర్కొన్నారు. ఏజీఆర్, చందాదార్ల సంఖ్యలో దేశంలోనే అగ్రగామి టెలికాం సంస్థగా జియో అవతరించిందన్నారు.
ఇదీ చూడండి: పరీక్ష లేకుండా ఎస్‌బీఐలో ఉద్యోగం!