ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో టెలికాం రంగంలో అగ్రగామిగా ఉంది. ఇప్పుడు డీటీహెచ్, ల్యాండ్‌లైన్ సేవల్లోనూ జియోను విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. అయితే గమ్యం చేరడం అంత సులువుకాదంటున్నారు నిపుణులు. ఇప్పటికే డీటీహెచ్ రంగంలో ఉన్న కంపెనీల నుంచి జియో గట్టిపోటీని ఎదుర్కోకకతప్పదని వారి అంచనా.
రిలయన్స్ జియో నెం: 1
ఇప్పటికే రిలయన్స్ జియో అత్యధిక మంది వినియోగదారులతో టెలికాం రంగంపై ఆధిపత్యం చెలాయిస్తోంది. కొత్తగా చేరుతున్న సబ్స్కైబర్ల సంఖ్య ఘననీయంగానే ఉంది. ఫలితంగా మిగతా పోటీదార్లపై తీవ్ర ప్రభావం పడింది. జియో ధాటికి కొన్ని సంస్థలు పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
విలీనం పోటీనిచ్చేనా?
ఇప్పుడు రిలయన్స్ జియో గిగాటీవీ... డీటీహెచ్ రంగంలో ఓ సంచలనంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఎయిర్టెల్ డిజిటల్ టీవీ- డిష్ టీవీ విలీనమైతే రిలయన్స్ జియో గిగాటీవీకి గట్టి పోటీ తప్పదంటున్నారు.ఎయిర్టెల్ డిజిటల్ టీవీలో డిష్ టీవీ విలీనమయ్యే అవకాశముంది. ఇదే జరిగితే దేశ డీటీహెచ్ రంగం చరిత్రలో ఇదే మొదటి భారీ విలీనం అవుతుంది. దీని వల్ల కంపెనీ మార్కెట్ షేర్ విలువ 61 శాతానికి పెరుగుతుంది.
రూ. 600లకే...
ప్రస్తుతం కొన్ని మెట్రో నగరాల్లోనే జియో గిగాటీవీ సేవలు అందిస్తోన్న జియో.. త్వరలోనే మిగతా నగరాలకూ విస్తరించడానికి సన్నద్ధమవుతోంది.
ఇందులో భాగంగా వినియోగదారుల కోసం కళ్లు చెదిరే ఆఫర్లు తీసుకోస్తోందని సమాచారం. బ్రాడ్‌బ్యాండ్, టీవీ, లాండ్‌లైన్ సేవలు అందించే ఓ ట్రిపుల్ ప్లాన్‌ను ప్రవేశపెట్టబోతోంది. కేవలం రూ.600లకు... 600 ఛానళ్లు, ఒక జీబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్, అపరిమిత ల్యాండ్‌లైన్ సేవలు ఈ ప్లాన్‌లో ఉండే అవకాశముంది.
ఇదీ చూడండి: భారీ పతనం నుంచి కోలుకున్న మార్కెట్లు