రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) తన టెలికాం వ్యాపారాన్ని విదేశాలకూ విస్తరించేందుకు యోచిస్తోంది. ఈ మేరకు నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ టెలికాం సంస్థ టి-మొబైల్‌లో మెజారిటీ వాటాలు సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. దాదాపు 5.7 బిలియన్ డాలర్లతో ఈ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టి-మొబైల్‌కి నెల వ్యవధిలో నాన్-బైండింగ్ ఆఫర్ పంపనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కొనుగోలుకు కావాల్సిన నిధులను సమకూర్చేందుకు కొన్ని ఆర్థిక సంస్థలను కూడా రిలయన్స్(Reliance News) ఇప్పటికే ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. పలు విదేశీ బ్యాంకులు సిండికేట్‌గా ఏర్పడి ఈ లావాదేవీకి కావాల్సిన నిధులు సమకూర్చేందకు సిద్ధమైనట్లు సమాచారం.
రిలయన్స్ టెలికాం విభాగమైన రిలయన్స్ జియో(Reliance Jio) బాధ్యతలు చూసుకుంటున్న ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ ఈ వ్యవహారాల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చమురు శుద్ధి వ్యాపారం నుంచి క్రమంగా ఇతర రంగాల్లోకి ప్రవేశిస్తున్న రిలయన్స్.. డిజిటల్ రంగంలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో అనేక యాప్‌లు, ఆన్‌లైన్ సర్వీసుల్ని తీసుకొస్తోంది. ప్రస్తుతం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భారత్‌లో అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించిన విషయం తెలిసిందే. టి-మొబైల్‌ని సొంతం చేసుకోవడం వల్ల ఐరోపా టెలికాం మార్కెట్‌పై రిలయన్స్‌కు పట్టు లభించే అవకాశం ఉంది.
టెలికాం కంపెనీలైన బెల్గాకామ్ ఎస్‌ఏ, టెలీ డెన్మార్క్‌లోని కొన్ని వాటాలను కొనుగోలు చేయడం ద్వారా జర్మనీకి చెందిన దాయిషే టెలికాం ఏజీ అనే కంపెనీ నెదర్లాండ్స్‌లోకి ప్రవేశించింది. తర్వాత 2003లో మిగిలిన వాటాల్ని కూడా కొనుగోలు చేసి టి-మొబైల్ నెదర్లాండ్స్‌గా నామకరణం చేసింది. ప్రస్తుతం దాయిషే టెలికాంకు టి-మొబైల్‌లో 75 శాతం వాటాలున్నాయి. 50.7 లక్షల కష్టమర్లు ఉన్నారు.
ఇదీ చూడండి: 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ముకేశ్ అంబానీ!