కరోనా కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగినట్లు కేంద్రం తెలిపింది. మార్చి నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు సాధించినట్లు రెవెన్యూ, ఆర్థిక శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. వీటి మొత్తం రూ. 1 లక్షా 23 వేల 902కోట్లు ఉన్నట్లు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
"మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు పెరగడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకోవడమే కాక.. విరివిగా పెరిగిన సాంకేతికతను ఉపయోగించి వసూళ్లు చేస్తున్నాము. గడిచిన ఆరు నెలలుగా... ప్రతి నెల రూ. లక్ష కోట్లకు పైగా జీఎస్టీ నుంచి ఆదాయం సమకూరుతోంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని ఆశిస్తున్నాము."
-తరుణ్ బజాజ్, రెవెన్యూ, ఆర్థిక శాఖ కార్యదర్శి
క్రమక్రమంగా ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుండటం ఆశకు ఊపిరిపోస్తుందని బజాజ్ అన్నారు. ఇందుకు తగినట్లు ఆర్థిక శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మంచి వృద్ధిని నమోదు చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.
కరోనా 2.0ను సమర్థంగా ఎదుర్కోగలం..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయని తెలిపిన బజాజ్.. వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు. ఇందుకు తగిన వ్యాక్సిన్లు, ఆరోగ్య మౌలిక సదుపాయాలు భారత్కు ఉన్నాయని చెప్పారు. వైరస్ కట్టడికి గతేడాది లాక్డౌన్ లాంటి చర్యలు చేపట్టామన్న ఆయన.. ప్రస్తుతం అలాంటివి అవసరం లేదని తేల్చి చెప్పారు.
ఇదీ చూడండి: '3 నెలల్లో రూ.20 వేల కోట్ల జీఎస్టీ అక్రమాలు'