స్టాక్ మార్కెట్లను ఈ వారం ఆర్బీఐ ద్వైమాసిక సమీక్ష నిర్ణయాలు, వాహన విక్రయాల లెక్కలు, స్థూల ఆర్థిక గణాంకాలు ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, వ్యాక్సిన్ వార్తలు సహా ఇతర అంతర్జాతీయ పరిణామాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలుగా ఉండనున్నాయి.
గురునానక్ జయంతి సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సెలవులో ఉన్న విషయం తెలిసిందే.
దేశ వృద్ధి రేటు అంచనాలకన్నా వేగంగా పుంజుకుంటున్నట్లు ఇటీవల విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలడం.. ఈ వారం మార్కెట్లకు సానుకూలంగా మారే అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష..
ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమీక్ష డిసెంబర్ 2న ప్రారంభం కానుంది. కమిటీ నిర్ణయాలు 4న వెలువడనున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఈ సారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకే కమిటీ మొగ్గు చూపొచ్చని అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్లు సంకేతాలు వస్తుండం వల్ల కొంత సర్దుబాటు ధోరణికి అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఎంపీసీ కమిటీ నిర్ణయాలను బట్టి మదుపరుల స్పందన ఉండొచ్చు.
నవంబర్ నెలకు సంబంధించి వాహన విక్రయాలు, జీఎస్టీ వసూళ్లు సహా పీఎంఐ గణాంకాలు ఈ వారమే విడుదల కానున్నాయి. ఈ గణాంకాలపై కూడా మదుపరులు దృష్టి సారించే వీలుందని జియోజిత్ ఫినాన్షియల్ సర్వీసస్ రీసెర్చ్ విభాగాధిపతి వినోద్ నాయర్ తెలిపారు.
వీటిన్నింటితోపాటు చమురు, రూపాయి హెచ్చుతగ్గులు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.
ఇదీ చూడండి:ఈ ఏడాది అదరగొట్టిన ఐపీఓలు