ఆర్బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లు తగ్గించవచ్చని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్నులు తగ్గించడం సహా పలు ఉద్దీపన చర్యలు చేపడుతున్న నేపథ్యమే ఇందుకు కారణం.
అక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ చర్చల తరువాత 2019-20 ఆర్థిక సంవత్సరం నాల్గవ ద్వైమాసిక ద్రవ్యవిధానాన్ని అక్టోబర్ 4న ప్రకటించనుంది.
వడ్డీ రేట్లు తగ్గిస్తూ..
కేంద్ర బ్యాంకు జనవరి నుంచి ఇప్పటి వరకు రెపో రేటును నాలుగు దఫాలుగా 1.10 శాతం మేర తగ్గించింది.
ఆగస్టులో ఎంపీసీ... బెంచ్మార్క్ రుణ రేటును అసాధారణ రీతిలో 35 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా రెపోరేటు 5.40 శాతానికి దిగొచ్చింది. బ్యాంకులు తాము పొందుతున్న రెపో రేటు తగ్గింపు ఫలాలను.. రుణ గ్రహీతలకు బదిలీ చేయాలని ఆర్బీఐ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది.
ప్రభుత్వ ఉద్దీపన చర్యలు.. ఆర్బీఐపై ఆశలు
మందగమనాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం.. కార్పొరేట్ పన్ను రేట్లు, వివిధ ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించింది. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. అదే సమయంలో ఆదాయ సేకరణ కూడా బడ్జెట్ అంచనాల కంటే తక్కువగా ఉంది.
ఈ కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు... ఆర్బీఐ మరింతగా ద్రవ్య ఉద్దీపనలు అందిస్తుందని ప్రభుత్వం ఆశలు పెట్టుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఓ సందర్భంలో పేర్కొన్నారు.
నిపుణుల అభిప్రాయం..
ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేనందువల్ల.. ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు చేపట్టడానికి ఆర్బీఐ చొరవ తీసుకోవల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సప్లై, డిమాండ్లను పెంచేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈసారి ఆర్బీఐ కనీసం 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఆర్థిక మందగమనం ఉన్నా రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండడం కొంత ఊరటనిచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల నవరాత్రులు, దీపావళి పండుగ సీజన్లో.. ఆర్బీఐ రేట్లు తగ్గిస్తుందని పారిశ్రామికవేత్తలు ఆశిస్తున్నారు. నిర్మాణ రంగానికి చేయూతనిచ్చేలా చర్యలు తీసుకుంటుందని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: మరో పారిశ్రామిక విప్లవం కోసం కేంద్రం కసరత్తు