వరుసగా నాలుగోసారీ భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్‌బీఐ) వడ్డీ రేట్లను మార్చలేదు. రెపో రేటు, రివర్స్ రెపో రేటు యథాతథంగా ఉంచనున్నట్లు స్పష్టం చేసింది. రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్దనే ఉండనున్నట్లు వెల్లడించింది.
కొవిడ్ కారణంగా.. అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థ పురోగమించడానికి అవసరమైతే వడ్డీ రేట్లను భవిష్యత్తులో తగ్గించనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.
ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్య, మౌలిక వసతుల రంగాలకు బడ్జెట్ ఊతమిచ్చిందని అన్నారు దాస్.
నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)ని మే 27న జరగబోయే తదుపరి పరపతి సమీక్ష నాటికి తిరిగి 4 శాతానికి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 0.625 శాతం 'క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్' లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆర్‌బీఐ.. బ్యాంకులకు ఇచ్చిన గడువును అక్టోబరు 2021వరకు పొడిగించింది. త్వరలో రిటైల్ ఇన్వెస్టర్లను నేరుగా గవర్నమెంట్ సెక్యూరిటీ మార్కెట్లోకి అనుమతించనున్నట్లు వెల్లడించారు. వినియోగదారుల ఫిర్యాధుల పరిష్కారానికి 'ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీం'ను జూన్ 2021 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
10.5 శాతం వృద్ధి రేటు..
ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, వృద్ధి సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. 2021-22లో జీడీపీ వృద్ధి రేటును 10.5 శాతంగా అంచనా వేశారు. ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందని తెలిపారు.