Ramcharan Co TFCC deal: చెన్నైకి చెందిన రసాయనాల పంపిణీదారు రామ్‌చరణ్ కో చరిత్ర సృష్టించింది. ఈ కంపెనీలో 46 శాతం వాటాను 4.14 బిలియన్ డాలర్లు(రూ.31,000 కోట్లకు పైగా) పెట్టి అమెరికాకు చెందిన టీఎఫ్‌సీసీ ఇంటర్నేషనల్ అనే ఇంపాక్ట్ ఫండ్ కొనుగోలు చేసింది. తద్వారా రామ్‌చరణ్ కో కంపెనీ విలువను 9 బిలియన్ డాలర్లు (సుమారు రూ.67,500 కోట్లు)గా లెక్కగట్టినట్లయింది.
Largest chemical deal India:
ఇది దేశీయ రసాయనాల రంగంలోనే అతిపెద్ద ఒప్పందం కావడంతో పాటు.. దేశంలో ఏ పరిశ్రమలోనైనా ఒక ప్రైవేటు ఈక్విటీ సంస్థ పెట్టిన అతిపెద్ద పెట్టుబడి కూడా ఇదే. న్యూయార్క్‌కు చెందిన టీఎఫ్‌సీసీ ఇంటర్నేషనల్ ఈ పెట్టుబడితో భారత్‌లోకి అడుగుపెట్టినట్లయింది. పర్యావరణ సొల్యూషన్లు, పునరుత్పాదక ఇంధనం, అందుబాటు ధర గృహాల విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని ఈ ఫండ్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ దక్షిణాసియాలో 20 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది.
Ramcharan Co background:
రామ్‌చరణ్ కంపెనీ 1965లో రసాయనాల పంపిణీదారుగా ప్రారంభమైంది. 2016 నుంచి ఇది పరిశోధన వైపూ మళ్లింది. అప్పటి నుంచి వ్యర్థాల నుంచి ఉత్పత్తులను అభివృద్ధి చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ సంస్థ మూడో తరం పారిశ్రామికవేత్తలైన దివ్యేశ్, కౌశిక్ పాలిచా చేతుల్లో ఉంది. రసాయనాల ట్రేడింగ్, పంపిణీ నుంచి కాంపౌండ్, స్పెషాలిటీ రసాయనాల తయారీ, టెస్టింగ్, రీసెర్చ్‌లోకి కార్యకలాపాలు విస్తరించినట్లు కంపెనీ వెబ్‌సైట్ చెబుతోంది. బ్రిటన్, ఉత్తర అమెరికా, జపాన్‌లలోనూ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఇదీ చదవండి: 'ఐటీకి పండగే.. వచ్చే మూడేళ్లు భారీ ఆర్డర్లు'