Rainbow Hospital IPO: మల్టీస్పెషాలిటీ పీడియాట్రిక్ హాస్పిటల్ రెయిన్‌బో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. ఐపీఓకు సంబంధించిన వివరాలను మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీకి అందజేసింది రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్. వీటిని సమీక్షించి సెబీ ఆమోదం తెలిపితే.. రెయిన్‌బో ఐపీఓకి మార్గం సుగమవుతుంది.
ఈ ఐపీఓ ద్వారా మొత్తం రూ.2,000 కోట్లకుపైగా సమీకరించనున్నట్లు సెబీకి రెయిన్‌బో తెలిపింది. వీటిలో తాజా షేర్లు ద్వారా రూ.280 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ కింద మరో 2.4 కోట్ల షేర్లను వాటాదారులు ఐపీఓలో విక్రయానికి ఉంచనున్నారు. అర్హత ఉన్న తమ ఉద్యోగులకు సబ్‌స్క్రిప్షన్‌లో రిజర్వేషన్ కల్పించనుంది.
ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను.. కంపెనీ జారీ చేసిన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల(ఎన్సీడీలు) అప్పులు చెల్లించడానికి , కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి, వైద్య పరికరాల కోనుగోలు సహా సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనుంది.
బ్రిటన్‌కు చెందిన ఫైనాన్స్ సంస్థ సీడీసీ గ్రూపు.. 1999లో హైదరాబాద్‌లో 50 పడకలతో తొలి రెయిన్‌బో పిల్లల స్పెషాలిటీ ఆస్పత్రిని స్థాపించింది. అప్పటి నుంచి సమర్థంగా సేవలందిస్తూ.. మల్టీ-స్పెషాలిటీ పీడియాట్రిక్ సేవల్లో అగ్రగామిగా ఎదిగింది. 2021 సెప్టెంబరు 30 నాటికి.. రెయిన్‌బోకు దేశంలో ఆరు నగరాల్లో 14 ఆస్పత్రులు, మూడు క్లినిక్‌లు ఉన్నాయి. మొత్తం 1500 పడకల సామర్థ్యం దీని సొంతం.
సెబీకి దరఖాస్తు చేసిన మరో టెక్ సంస్థ
సాఫ్ట్వేర్ సంస్థ క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది. ఈ ఐపీఓ ద్వారా మొత్తం రూ.850 కోట్లు సమీకరించనున్నట్లు సమాచారం. వీటిలో తాజా షేర్లు ద్వారా రూ.200 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ.650 కోట్ల విలువైన షేర్లు విక్రయించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: EPF Transfer Online: ఈజీగా ఈపీఎఫ్ బదిలీ చేయండిలా..