భారతీయ రైల్వే యువత కోసం ఓ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. రైల్వే టికెట్ ధరపై ఏకంగా 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కార్యక్రమంలో భాగంగా ఈ సదుపాయం కల్పిస్తోంది.
అర్హులు ఎవరు?
సెకెండ్, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణించే యువతకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. అది కూడా నెలకు ఆదాయం రూ.5000 లోపు ఉండాలి. అలాగే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పయనిస్తుండాలి. రైలు ఎక్కే, దిగే స్టేషన్లకు మధ్య కనీస దూరం 300 కిలోమీటర్లు ఉండాలి.
'డిస్కౌండ్ టికెట్' ప్రయోజనం పొందడానికి మానవ వనరుల అభివృద్ధిశాఖ సెక్రటరీ నుంచి సర్టిఫికేట్ కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.
సాధారణ సర్వీసులకు మాత్రమే!
ఈ తగ్గింపు ప్రయోజనం సాధారణ ట్రైన్ సర్వీసులకు (మెయిల్, ఎక్స్‌ప్రెస్) మాత్రమే వర్తిస్తుంది. స్పెషల్ ట్రైన్లు, ప్రత్యేక కోచ్‌లకు వర్తించదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక, చట్టబద్ధ సంస్థలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాల ఖర్చులతో ప్రయాణించే వారికి కూడా ట్రైన్ టికెట్లపై తగ్గింపు ప్రయోజనం వర్తించదు.
ప్రాథమిక ఛార్జీకే వర్తింపు
50 శాతం తగ్గింపు ప్రయోజనం కేవలం రైలు టికెట్ ప్రాథమిక ఛార్జీకి (బేసిక్ ఫేర్) మాత్రమే వర్తిస్తుంది. రిజర్వేషన్ ఛార్జీలు, ఇతర సప్లిమెంటరీ ఛార్జీలు అదనంగా చెల్లించాల్సిందే.
ఇదీ చూడండి: వ్యాపార మాయాజాలంలో పడ్డారో.. మీ జేబు గుల్లే!