బ్యాంకులు ఏర్పాటు చేయడానికి కార్పొరేట్ సంస్థలకు అనుమతులివ్వాలని ఆర్‌బీఐ అంతర్గత వర్కింగ్ గ్రూప్(ఐడబ్ల్యూజీ) చేసిన ప్రతిపాదనను ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య తప్పుబట్టారు. ఇలాంటి సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగంలోకి కార్పొరేట్ సంస్థల ప్రమేయాన్ని పరిమితం చేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను కొద్దిరోజుల పాటు నిలిపివేయడమే సమంజసమని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రాజన్, ఆచార్య సంయుక్తంగా ఓ కథనం రాశారు.
ఐడబ్ల్యూజీ చేసిన ప్రతిపాదనలో చాలా మినహాయింపులు ఉన్నాయని ఇరువురు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఇప్పుడే ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ఆర్‌బీఐ అధికారాలు పెరిగేలా 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టానికి సవరణలు ప్రతిపాదించారని, అయినప్పటికీ ఈ ప్రతిపాదన విజయవంతం కావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
"రుణగ్రహీతల చేతిలోనే బ్యాంకులు ఉంటే సరైన రుణాలు ఎలా వెళ్తాయి? పూర్తి సమాచారం ఉన్న స్వతంత్ర రెగ్యులేటర్లకు సైతం చెడు రుణాలు జారీ చేయకుండా ఆపడం కష్టమవుతోంది. చట్టాలు రూపొందిస్తేనే సరైన నియంత్రణ, పర్యవేక్షణ సాధ్యమైనట్లైతే.. భారత్‌లో ఎన్పీఏ సమస్య ఉండేదే కాదు. ఐడబ్ల్యూజీ ప్రతిపాదించిన చాలా సాంకేతిక హేతుబద్దీకరణ ప్రతిపాదనలు పాటించడం అవసరమే. అయితే కార్పొరేట్ సంస్థలను బ్యాంకింగ్‌లోకి అనుమతించాలని చేసిన ప్రధాన ప్రతిపాదన మాత్రం కొద్దిరోజులు నిలిపివేస్తేనే మంచిది."
-రఘురాం రాజన్, విరాల్ ఆచార్య
ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో మాదిరిగానే భారత్‌లోనూ బ్యాంకులు వైఫల్యం చెందడం చాలా అరుదైన విషయమని అని అన్నారు రాజన్, ఆచార్య. ఇటీవలి ఎస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంకు ఉదంతాలే ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు. డిపాజిటర్లు తమ డబ్బు సురక్షితంగానే ఉందని భావిస్తారని తెలిపారు.
కార్పొరేట్ సంస్థలను బ్యాంకింగ్ రంగంలోకి అనుమతించకుండా ఉండేందుకు రెండు కారణాలు ఉన్నాయని చెప్పారు. కార్పొరేట్లకు డబ్బు అవసరమని.. బ్యాంకుల నుంచి వీరికి సులభంగా రుణాలు అందవని పేర్కొన్నారు. అదే ఇన్-హౌస్ బ్యాంకు ద్వారా ఎలాంటి అడ్డు లేకుండా రుణాలు లభిస్తాయని చెప్పారు. మరోవైపు, ఈ నిర్ణయం వల్ల వ్యాపార, బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక, రాజకీయ శక్తుల ప్రభావం అధికమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
గతవారం, అంతర్గత కార్యచరణ బృందం పలు సిఫార్సులు చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టానికి సవరణలు చేసిన తర్వాత భారీ కార్పొరేట్ సంస్థలు బ్యాంకులను ప్రమోట్ చేసేందుకు అనుమతించాలని నిర్ణయించింది.