కోడి మాంసం తింటే కరోనా వస్తుందన్న వదంతులతో గత ఆర్థిక సంవత్సరం చివర్లో డిమాండు తగ్గి, ధరలు పడిపోయినా.. జూన్ నుంచి కోళ్ల పరిశ్రమ తిరిగి పుంజుకుందని ఓ నివేదిక తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని మెరుగైన లాభాలతోనే ముగించే అవకాశం ఉందని పేర్కొంది. కోళ్ల దాణా ధరలు తక్కువ స్థాయిల్లో ఉండటం, మాంసం-గుడ్ల ధరలు పెరగటం లాంటివి ఇందుకు దోహదం చేయొచ్చని ఇక్రా తాజా నివేదికలో పేర్కొంది. 2020-21 రెండో త్రైమాసికంలో కోళ్ల పరిశ్రమ గణనీయంగా పుంజుకుంది.
2019-20లో లాభాలు ఆవిరైనప్పటికీ..2020-21లో మెరుగైన లాభాలనే కోళ్ల పరిశ్రమ నమోదు చేస్తుందని నివేదిక పేర్కొంది. కొవిడ్-19 ముందున్న లాభదాయక స్థితికి పుంజుకోవచ్చనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని కోళ్ల పరిశ్రమ భవిష్యత్ అంచనాను 'ప్రతికూలం' నుంచి 'స్థిరత్వం'కు ఇక్రా సవరించింది. 'గత ఆర్థిక సంవత్సరంలో కోళ్ల రంగానికి చెందిన చాలా కంపెనీలు నష్టాలు మూటకట్టుకున్నాయి. కొన్న చిన్న కంపెనీలైతే దివాలా తీశాయి కూడా. వినియోగం తగ్గడం, అధిక దాణా ధరలు, తక్కువ మార్జిన్లు ఇందుకు కారణమయ్యాయని ఇక్రా అధ్యక్షుడు ఆశీష్ మోడానీ తెలిపారు. 2020 జూన్ నుంచి పరిశ్రమ స్థితిగతులు మారిపోయాయమి చెప్పారు. ఈ పరిణామం మార్జిన్లు జీవనకాల గరిష్ఠాలకు చేరేందుకు దారి తీసిందని, కంపెనీలు లాభాలు నమోదు చేసేందుకు తోడ్పతుందని పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంలో కోళ్ల సరఫరా పరిమితంగా ఉండటం కూడా తొలి అర్ధ భాగంలో దేశవ్యాప్తంగా మార్జిన్లు మెరుగయ్యేందుకు కారణమైందని పేర్కొంది. దాణా వ్యయాల్లో 60-63శాతం వరకు ఉండే మొక్క జొన్న ధరలు కిలోకి రూ.13 తగ్గడం కూడా కంపెనీలు లాభాలు నమోదు చేసేందుకు తోడ్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇదీ చదవండి : గుడ్లు, చికెన్‌తో కరోనా వ్యాపించదు..అవన్నీ అపోహాలే!