PM Modi global investors: వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) బడ్జెట్ రూపకల్పనలో భాగంగా నిర్వహిస్తున్న బడ్జెట్ ముందస్తు చర్చల్లో ప్రధాని మోదీ శుక్రవారం అగ్రశ్రేణి పెట్టుబడిదార్లతో భేటీ అయ్యారు. దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ/వెంచర్ క్యాపిటల్ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన వారి పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ గమ్యస్థానం కావాలంటే ఏం చేయాలో సలహాలు, సూచనలు స్వీకరించారు. సులభతర వ్యాపార నిర్వహణ, అధిక మూలధనాన్ని ఆకర్షించడం, సంస్కరణల ప్రక్రియ వంటి వాటిపైనే చర్చ ఎక్కువగా సాగిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
PM Modi news
గత ఏడాది నవంబరులో కూడా 20 మంది దిగ్గజ అంతర్జాతీయ పెట్టుబడిదార్లతో ప్రధాని సమావేశమయ్యారు. వీరు 6 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.450 లక్షల కోట్లు) ఆస్తుల్ని నిర్వహిస్తున్నారు. సులభతర వాణిజ్యంలో భారత్ ర్యాంక్ మెరుగవ్వడం కోసం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భాజపా ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకొచ్చింది. అంతర్జాతీయ తయారీ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలను ప్రకటిస్తోంది. వాహన రంగం, సెమీ కండక్టర్లు, సౌర విద్యుత్ రంగాలకు చెందిన కంపెనీలు దేశీయంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2022-23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Global investors on Modi
- ప్రధానితో సమావేశ అనంతరం సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధి మునీశ్ వర్మ మాట్లాడుతూ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వాతావరణం చాలా సానుకూలంగా ఉందని తెలిపారు.
- భారత్‌కు మరింతగా పెట్టుబడులు తీసుకురావడానికి ప్రధానితో ఏర్పాటు చేసిన సమావేశం ప్రేరణ ఇచ్చిందని జనరల్ అట్లాంటిక్ ప్రతినిధి సందీప్ నాయక్ వెల్లడించారు.
- మోదీని 'స్టార్టప్ ప్రైమ్ మినిస్టర్'గా 3ఒన్4 ప్రతినిధి సిద్ధార్థ్ పాయ్ అభివర్ణించారు. దేశంలో అంకురాల ప్రోత్సాహానికి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని తెలిపారు.
- వ్యవసాయ అంకురాల్లో ప్రస్తుతం అవకాశాలు బాగున్నాయని యాక్సెల్ ప్రతినిధి ప్రశాంత్ ప్రకాశ్ వెల్లడించారు.
సిఖోయా క్యాపిటల్ నుంచి రాజన్ ఆనందన్, హెచ్‌డీఎఫ్‌సీ నుంచి విపుల్ రూంగ్టా, ఇండియా రిసర్జంట్ నుంచి శాంతను నలవాడి, బ్లాక్‌స్టోన్ నుంచి అమిత్ దాల్మియా, టీవీఎస్ క్యాపిటల్స్ నుంచి గోపాల్ శ్రీనివాసన్, మల్టిపుల్స్ నుంచి రేణుకా రామనాథ్, కేదారా క్యాపిటల్ నుంచి మనీశ్ కేజ్రీవాల్, క్రిస్ నుంచి అష్లే మెనెజెస్, ఆవిష్కార్ నుంచి వినీత్ రాయ్ అడ్వెంట్ నుంచి శ్వేతా జలాన్, బ్రూక్‌ఫీల్డ్ నుంచి అంకుర్ గుప్తా, ఎలెవేషన్ నుంచి ముకుల్ అరోరా, ప్రాసస్ నుంచి సెహ్‌రాజ్ సింగ్, గజా క్యాపిటల్ నుంచి రంజిత్ షా, యర్నెస్ట్ నుంచి సునీల్ గోయల్, ఎన్‌ఐఐఎఫ్ నుంచి పద్మనాభ సింహా ప్రధాని మోదీతో భేటీ అయిన వారిలో ఉన్నారు. పీఎంఓ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'భారత్‌కు కావాల్సింది వికాసం.. విప్లవం కాదు'