డిజిటల్ చెల్లింపులకు అనువుగా వర్తకుల కోసం ఆల్ ఇన్ వన్ క్యూఆర్ కోడ్‌ను ప్రారంభించినట్లు డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం ప్రకటించింది. ఈ క్యూఆర్ ఉపయోగించి పేటీఎం వాలెట్, రూపే కార్డులు సహా యుపీఐ ఆధారిత అన్ని పేమెంట్ యాప్‌ల నుంచి అపరిమిత చెల్లింపులు జరపుకోవచ్చని తెలిపింది.
వ్యాపారులు ఎలాంటి ఛార్జీలు లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలోకి డబ్బులు బదిలీ చేసుకోవచ్చని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. పేటీఎం వాలెట్, యూపీఐ యాప్‌లు, కార్డుల ద్వారా చెల్లింపులు చేసుకోగలిగిన ఏకైక క్యూఆర్ ఇదేనని ఆయన వెల్లడించారు. వర్తకుల ఉపయోగార్థం పవర్‌బ్యాంకులు, గడియారాలు, రేడియో వంటి వాటిపై ముద్రించేందుకు వీలుగా ఈ క్యూఆర్ కోడ్లను రూపొందించినట్లు తెలిపారు.
సౌండ్ బాక్స్
ఆల్ ఇన్ వన్ క్యూఆర్తోపాటు పేమెంట్ లావాదేవి విజయవంతం అయిన విషయాన్ని ధ్రువీకరిస్తూ ఆడియో సందేశం అందించే 'సౌండ్‌బాక్స్' పరికరాన్ని తయారు చేస్తున్నట్లు పేటీఎం ప్రకటించింది. ఈ పరికరం అన్ని రకాల చెల్లింపులకు సహకరిస్తూ... బహుళ భాషల్లో అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
బిజినెస్ ఖాతా
క్యూఆర్‌తో పాటు 'పేటీఎం బిజినెస్ ఖాతా' సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది సంస్థ. వర్తకులు తమ రోజువారీ నగదు, నగదేతర లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని వెల్లడించింది.