కొవిడ్-19 రెండోదశ తీవ్రత హెచ్చి ఆస్పత్రుల పాలయ్యే బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో జ్వరం, యాంటీ-బయాటిక్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లకు మళ్లీ గిరాకీ పెరిగింది. జ్వరానికి వాడే పారాసెట్మాల్ ట్యాబ్లెట్ల అమ్మకాలు బాగా పెరిగినట్లు ఔషధ కంపెనీలు, రిటైల్ దుకాణాల నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. కొవిడ్-19 వ్యాధి మొదటి లక్షణం జ్వరం రావడం. ఆ తర్వాత గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు, ఆయాసం.. కనిపిస్తున్నాయి. వ్యాధి నిర్థారణ అయిన వెంటనే పారాసెట్మాల్ తో పాటు కొన్ని యాంటీ-బయాటిక్ ఔషధాలు, యాంటీ-వైరల్ ఔషధాలతో పాటు త్వరగా శక్తి పుంజుకోడానికి వీలుగా విటమిన్ ట్యాబ్లెట్లను వైద్యులు సిఫారసు చేస్తున్నారు. ఇటీవల కొవిడ్-19 బాధితుల సంఖ్య మళ్లీ బాగా పెరిగి ఈ మందులు కొనుగోలు చేయడం ఎంతో పెరిగింది. దీనివల్ల పారాసెట్మాల్, అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్, లెవోసిట్రిజిన్, మాంటెలుకాస్ట్.. తదితర ఔషధాలకు డిమాండ్ హెచ్చింది.
దేశ-విదేశీ మార్కెట్లకు ఇవీ
ఇక కొవిడ్-19 వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు వైద్యులు ఫావిపిరవిర్ బిళ్లలు, ఇంకా అధికంగా ఉంటే ఆసుపత్రిలో చేర్చుకుని రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ సిఫారసు చేస్తున్నారు. ఇప్పటికే రెమ్‌డెసివిర్ కొరత ఏర్పడగా, సరఫరాలు పెంచేందుకు ప్రభుత్వం, ఫార్మా కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో పాటు పారాసెట్మాల్, యాంటీ-బయాటిక్ ఔషధాల తయారీని సైతం ఫార్మా కంపెనీలు అధికం చేశాయి. దేశీయ అవసరాలకు మాత్రమే కాకుండా ఐరోపా, ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి పారాసెట్మాల్, యాంటీ-బయాటిక్ ఔషధాలకు డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. పారాసెట్మాల్ ముడిపదార్థాల ధరలూ ఇటీవల బాగా పెరిగాయి.
హైదరాబాదీ కంపెనీల్లో..
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్రాన్యూల్స్ ఇండియా పారాసెట్మాల్ తయారీలో అగ్రగామిగా ఉంది. దీంతో పాటు డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా యాంటీ-బయాటిక్ ఔషధాలు భారీఎత్తున తయారు చేస్తున్నాయి. కొవిడ్-19 బాధితులకు వైద్యులు సిఫారసు చేస్తున్న మందుల తయారీని ఈ కంపెనీలు గణనీయంగా పెంచినట్లు తెలుస్తోంది. దేశంలో ఇతర అగ్రగామి ఫార్మా కంపెనీలైన సిప్లా, లుపిన్, గ్లెన్‌మార్క్, సన్‌ఫార్మా.. కూడా ఈ ఔషధాల తయారీని పెంచినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఫావిపిరవిర్ తయారీ పునఃప్రారంభం
ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి కొవిడ్-19 లక్షణాలు ఉన్నట్లయితే యాంటీ-వైరల్ ఔషధమైన ఫావిపిరవిర్ ను వైద్యులు సిఫారసు చేస్తున్నారు. ఈ ఔషధాన్ని హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీలు ఎక్కువగా తయారు చేస్తున్నాయి. ఒక నెల క్రితం వరకు ఈ ఔషధానికి అసలు గిరాకీ లేదు. దాదాపుగా కొవిడ్-19 తగ్గిపోయిన పరిస్థితి ఏర్పడినందున, ఫావిపిరవిర్ ఔషధ తయారీని స్థానిక ఫార్మా కంపెనీలు బాగా తగ్గించాయి. మళ్లీ ఇప్పుడు ఒక్కసారిగా గిరాకీ ఏర్పడటంతో ఈ ఔషధ తయారీని మొదలు పెట్టినట్లు ఆప్టిమస్ ఫార్మా ఎండీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ముడిపదార్థాల ధరలు పెరిగి, సరఫరాలు తగ్గాయని, వారం-పదిరోజుల్లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ట్యాబ్లెట్లను 200, 400, 800 ఎంజీ మోతాదుల్లో సిద్ధం చేస్తున్నందున, గతంలో మాదిరి ఎక్కువ సంఖ్యలో వేసుకోవాల్సిన అవసరం రాదన్నారు.
మహమ్మారులు.. మనల్ని మారుస్తున్నాయ్
కరోనా వల్ల భారత్‌లో డిజిటల్ ప్రయాణం వేగం అందిపుచ్చుకుంది. వ్యాపారాల్లోనే కాదు విద్య, ఆరోగ్య సంరక్షణ, పాలన వంటి ఇతర రంగాల్లోనూ ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని ఉద్యోగాల సృష్టికి, దేశాభివృద్ధి విషయంలో పెద్ద నగరాలపై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగించుకోవాలి. మహమ్మారులు రావడం మన దురదృష్టం. అయితే.. ప్లేగ్ వల్ల జీవన ప్రమాణాలు పెరిగాయి. కలరా వల్ల పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చాం. స్పానిష్ ఫ్లూతో పలు దేశాల్లో సామాజిక ఆరోగ్యసంరక్షణ వ్యవస్థలు ఏర్పడ్డాయి. కొవిడ్‌తోనూ పరిశుభ్రత, ఆరోగ్యకర ఆహార అలవాట్లు ఏర్పడుతున్నాయి. ఇవి ప్రపంచాన్ని కొత్త దిశలో పయనించేలా చేస్తున్నాయి.
- సంజీవ్ మెహతా, హెచ్‌యూఎల్ సీఎండీ
ఇదీ చదవండి: భారత్‌లో టీకా తయారీకి అమెరికా చట్టం అడ్డుపుల్ల!
ఇదీ చదవండి: 'సిటీ' నిష్క్రమిస్తే.. వారికి మంచి అవకాశం!