కరోనా కారణంగా తలెత్తిన అనిశ్చితితో అంతర్జాతీయంగా కరెన్సీకి డిమాండ్ పెరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థలో నగదును తగ్గించడంలో నోట్ల రద్దు విఫలమైందన్న విమర్శలను తోసిపుచ్చాయి. డీ-మానిటైజేషన్ తర్వాత పెరిగిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ.. నగదుపై ఆధారపడటాన్ని తగ్గించిందని స్పష్టం చేశాయి.
75 ఏళ్లలో అత్యధికంగా..
అమెరికాలోనూ నగదు చలామణి భారీగా పెరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2020లో 2.07 ట్రిలియన్ డాలర్ల (రూ.153 లక్షల కోట్లు) విలువైన నోట్లు చలామణి జరిగినట్లు పేర్కొన్నారు. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే.. ఇది 16శాతం ఎక్కువని వివరించాయి. 1945 తర్వాత ఒకే ఏడాదిలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారని తెలిపాయి.
ఆర్థిక వృద్ధి, వడ్డీరేట్లతో పాటు మరికొన్ని అంశాలపై నగదు డిమాండ్ ఆధారపడి ఉంటుంది. ఆర్థిక ఒడుదొడుకులు ఎదురైన సమయంలో నగదుకు గిరాకీ పెరగడం సాధారణం. 2020-21లో కరెన్సీ నోట్లకు గిరాకీ పెరగడానికి కరోనా ముఖ్య కారణం.
'15 శాతం పెరిగిన నగదు చలామణి..'
భారత్‌లో యూపీఐని 2016లో ప్రారంభించారు. అప్పటి నుంచి నెలనెలా డిజిటల్ లావాదేవీలు పెరుగుతూ వస్తున్నాయి. 2021 అక్టోబరులో 421 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.7.71 లక్షల కోట్లు.
2016 నవంబరు 4న రూ.17.74 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉండగా.. 2021 అక్టోబరు 29 నాటికి రూ.29.17 లక్షల కోట్లకు పెరిగాయి. 2020-21లో కరెన్సీ నోట్ల చలామణి(సీఐసీ) విలువ పెరుగుదల 17.2 శాతంగా ఉంది. ఇది కరోనా ప్రేరిత డిమాండ్‌తో పోల్చి చూస్తే.. గత గణాంకాలకు అనుగుణంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అయితే 2019 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే.. 2021 ఆర్థిక ఏడాదిలో 1.1 లక్షల కరెన్సీ నోట్లు తగ్గినట్లు కొన్ని నివేదికలు తేల్చాయి.
ఇదీ చూడండి: ట్విట్టర్ పోల్కే 'మస్క్' సై- టెస్లా వాటా విక్రయానికి సిద్ధం