ఒక మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేసింది. భూగోళాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. ప్రపంచ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేసింది. ప్రపంచ మార్కెట్లను బెంబేలెత్తిస్తోంది. ఒక్కటేమిటి.. అన్నింటినీ సమూలంగా నాశనం చేసింది. హాయిగా ఉండాల్సిన ప్రజలు.. పెద్దగా రోడ్ల మీదకు రావడమే మానేశారు. అన్నింటికీ కారణం ఒక్కటే.. కరోనా వైరస్.
కరోనా గుప్పిట్లో లాక్డౌన్ నడుమ గడిపిన ప్రపంచదేశాలు.. ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఆంక్షల్లో సడలింపులు ఇస్తున్నాయి. క్రమక్రమంగా అన్నీ తెరుచుకుంటున్నాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది షాపింగ్ మాల్స్ గురించి. వీటి సంగతేంటి..?
జనాలు గుంపులు గుంపులుగా సంచరించే ప్రదేశాల్లో షాపింగ్ మాల్స్ ఒకటి. మరి కరోనా భయాందోళనలతో ఇవి పునర్వైభవం సంతరించుకుంటాయా? ఒకప్పటిలా గంటలు గంటలు మాల్స్‌లో గడపలేమా? కరోనా ఏం మార్పులు తెచ్చింది?
మాస్కులు, శానిటైజర్లతో స్వాగతం..
కొవిడ్ దెబ్బకు... షాపింగ్ మాల్స్‌లో పెను మార్పులు రానున్నాయి. మాస్కులు తప్పనిసరి అయ్యాయి. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు స్వాగతం పలకనున్నాయి. ఇంకా అధునాతన సాంకేతికతతో కొత్త కొత్తవి ఎదురైనా ఆశ్చర్యపోనవసరం లేదు. కొవిడ్ సంక్షోభం మొత్తం షాపింగ్ అనుభవాల్ని తలకిందులు చేసినా.. ఇది మరింత సులభంగా, వేగంగా, సురక్షితంగా మారొచ్చన్నది నిపుణుల మాట.
ఇప్పటికే అమెరికా సహా పలు దేశాల్లో కొత్త టెక్నాలజీలను పరిచయం చేస్తూ షాపింగ్ మాళ్లూ, స్టోర్లూ తెరుచుకున్నాయి. ఆ అనుభూతులు ఆశ్చర్యాన్ని కలిగించినా.. వాటికి అలవాటు పడక తప్పదంటున్నారు వినియోగదారులు.
''ప్రతిదీ చాలా భిన్నంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే వైరస్ ఎంతటి ప్రభావం చూపిందో అర్థమవుతోంది.''
- టియారా షో, అమెరికాలోని ఓ షాపర్
'అమెరికన్ ఈగల్ అవుట్‌ఫిట్టర్స్' మాల్లో తన అనుభవాల్ని పంచుకుంది 23 ఏళ్ల టియరా. ఆ వస్త్ర దుకాణంలో మాస్కులు తప్పనిసరి చేశారని చెప్పిన ఆమె.. అల్మారాలు క్రమబద్ధంగా అమర్చారని అంటోంది. ట్రయల్స్‌కు అనుమతించట్లేదనీ చెప్పుకొచ్చింది.
'' మాల్‌లోకి వెళ్లేముందు ఒక్కసారి వాడిపారేసే మాస్కులు అందించారు. అరికాళ్లను శుభ్రపరిచే బ్లూమ్యాట్(స్టిక్కీ మ్యాట్)లనూ అందుబాటులోకి తెచ్చారు. జీన్స్, షర్ట్స్ విభాగాలు వేర్వేరు చోట్ల ఉన్నాయి. ట్రయల్స్‌ను ప్రోత్సహించట్లేదు. ఫిట్టింగ్ రూంను మూసేశారు. కావాలసినవన్నీ కొన్నాక.. ప్లెక్సీగ్లాస్ డివైడర్ నుంచే నాకందించారు. ప్రింటర్ నుంచి బయటకు వచ్చిన రసీదును కూడా స్వయంగా నేనే తీసుకున్నాను.''
- టియరా షో, షాపర్
వినియోగదారులు సంతృప్తిపడేలా, మాల్లో అడుగుపెట్టిన క్షణం నుంచి కొత్త అనుభూతికి లోనయ్యేలా చూసుకుంటున్నారు నిర్వాహకులు. ప్రతిదీ విభిన్నంగా ప్రయత్నించాలని చూస్తున్నారు. కొన్నింటిలో రోబోలను పరిచయం చేస్తూ.. సులభతర షాపింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. ఇవన్నీ వినియోగదారులకు సరికొత్త అనుభవాల్ని మిగులుస్తున్నాయి.
''స్టిక్కీ మ్యాట్, వెల్కం టేబుల్ (మాస్కులు, శానిటైజర్లు).. ఇవన్నీ చూడగానే పరిస్థితులన్నీ మారాయని వినియోగదారుల మదిలో ఆలోచనలు మెదులుతాయి.''
- ఆండ్రూ మెక్లీన్, అమెరికాలోని ఓ కంపెనీ చీఫ్ కమర్షియల్ అధికారి
అందుకో యాప్..
ఇంకా మాల్స్‌లో జనాన్నీ పరిమిత సంఖ్యలోనే అనుమతించనున్నారు. దీనిని ఆచరణలో పెట్టేందుకు అమెరికాలోని స్టోర్లలో విభిన్న యాప్‌లను ప్రవేశపెడుతున్నారు. షాపింగ్ కోసం లోపలికి వెళ్లేముందు.. మాల్లో ఎంతమంది ఉన్నారో వీటి ద్వారా తెలుసుకోవచ్చు. కరోనా కాలంలో ఇది ఎంతో సురక్షితమని అభిప్రాయపడుతున్నారు.
ఇంకా సెలూన్లు, పార్లర్లు కూడా కఠిన నిబంధనలు అమలుచేస్తున్నాయి. అమెరికాలోని కాస్మోటిక్స్ దిగ్గజ సంస్థ సిఫోరా.. వినియోగదారులు తమ ఉత్పత్తుల్ని పరీక్షించేందుకు అనుమతి నిరాకరిస్తోంది.
అమెరికా బాటలోనే పలు దేశాలు ఇదే ప్రయత్నిస్తున్నాయి. షాపింగ్‌ను సురక్షితంగా, క్రమబద్ధంగా చేసేలా ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు చేపడుతున్నాయి.
అపాయింట్మెంట్లు..
జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకొని.. కొన్ని స్టోర్లు 'షాప్ బై అపాయింట్మెంట్' అనే కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకొని.. నిర్దేశించిన సమయానికి షాపింగ్ చేసుకునేలా వెసులుబాటు కల్పించాలని చూస్తోంది యాపిల్. ఇవంతటా అందుబాటులోకి వస్తే కరోనా భయాలున్నా... భౌతిక దూరం నిబంధన పాటించినట్టే కనుక షాపింగ్‌ను సులభంగానే చేసుకోవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి.
వచ్చామా.. కొన్నామా.. వెళ్లామా..!
కరోనా నేర్పిన పాఠాలతో.. సమూల మార్పులు సంభవించాయి. గతంతో పోలిస్తే ఏ రంగంలోనైనా ఒడుదొడుకులు ఉన్నప్పటికీ పటిష్ఠ చర్యలతో కాలక్రమేణా వాటిని అధిగమించొచ్చని విశ్లేషకులు అంటున్నారు. షాపింగ్ మాల్స్‌లోనూ కరోనా వ్యాప్తికి అవకాశం ఉన్నప్పటికీ.. ముందస్తు జాగ్రత్తలు, అధునాతన సాంకేతికతలతో వైరస్‌కు చెక్ పెట్టొచ్చంటున్నారు.
ఇకపై స్టోర్‌లోకి వెళ్లడమే ఆలస్యం.. చూశామా, కొన్నామా, వెనుదిరిగామా అనే వాతావరణమే కనిపించే అవకాశాలున్నాయి. మాల్స్‌లో వెచ్చించే సమయాన్ని తగ్గించుకొని, అన్నింటినీ సరిగ్గా వినియోగించుకుంటే షాపింగ్‌ను ఇకపై సులభంగా, వేగంగా.. సురక్షిత సానుకూల వాతావరణంలోనే చేసుకోవచ్చని సెలవిస్తున్నారు నిపుణులు.
ఇవీ చూడండి: