ఫంక్షన్ ఏదైనా వజ్రాభరణాలు ధరిస్తే.. అసలైన కళ సంతరించుకుంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్లలో ఈ ట్రెండ్ ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే.. ఒకప్పుడు అంతర్జాతీయంగానే వజ్రాలకు గిరాకీ ఉండగా.. ఇప్పుడు మన దేశంలోనూ వీటికి ఆదరణ పెరిగింది. యువత అధికంగా ఉన్న మన దేశంలో భవిష్యత్‌లో ఇది మరింత అధికమవుతుంది' అంటున్నారు ఓరా మేనేజింగ్ డైరెక్టర్ దీపు మెహతా.
దేశీయంగా, అంతర్జాతీయంగా వజ్రాభరణాలకు గిరాకీ ఎలా ఉంది?
కొవిడ్-19 ఆరంభంలో కొన్నాళ్లపాటు ఆభరణాల మార్కెట్ కొంత ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంది. 2020 నవంబరు, డిసెంబరు నుంచి ఆభరణాలకు గిరాకీ పెరిగింది. వజ్రాభరణాల గిరాకీలోనూ 6 నెలలుగా వృద్ధి కనిపిస్తోంది. అమెరికా, ఐరోపాలలో కొనుగోళ్ల జోరు పెరిగింది. భారత్‌లోనూ కొనుగోళ్లు అధికంగానే జరుగుతున్నాయి.
ముడి వజ్రాల లభ్యత, సాన పెట్టడంలాంటి విషయాల్లో ఇబ్బందులేమైనా ఉన్నాయా?
కరోనా లాక్‌డౌన్‌ల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ముడి వజ్రాల లభ్యతలో ఇబ్బందులు వచ్చాయి. ఏటా 20 మిలియన్ క్యారెట్ల వరకు ఉత్పత్తి చేసే ఆస్ట్రేలియాలోని ఆర్గైల్ వజ్రాల గని మూతపడింది. దీంతో చిన్న వజ్రాల లభ్యత కాస్త కష్టంగా మారింది. చాలామంది కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లడంతో వజ్రాలను సాన పెట్టడంలో ఇబ్బందులు వచ్చాయి. కరోనా తీవ్రత తగ్గాక కార్మికులు తిరిగి వస్తున్నారు. కొన్నాళ్లలో ఇది సాధారణ స్థితికి చేరుతుంది. ముడి వజ్రాల లభ్యత పూర్వస్థితికి చేరేందుకు కొంత సమయం పడుతుంది.
ఇటీవల వజ్రాల ధర ఒక్కసారిగా పెరిగింది. సమీప భవిష్యత్తులో తగ్గే అవకాశాలున్నాయా? బంగారం లాగా వజ్రాల ధరలనూ ప్రకటించే ఏర్పాట్లేవైనా వస్తాయా?
గత ఏడాది మార్చి నుంచి కొన్ని నెలలపాటు వజ్రాలకు గిరాకీ బాగా తగ్గడంతో, ధరలూ దిగివచ్చాయి. రిటైల్ దుకాణాల నుంచి వజ్రాలకు ఆర్డర్లు తగ్గాయి. కొంతకాలంగా పరిస్థితి మారి, వజ్రాలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. సరఫరా తక్కువగా ఉండి, గిరాకీ పెరగడంతో ధరలు పెరిగాయని చెప్పొచ్చు. కొన్నాళ్లలో ధరల స్థిరీకరణ జరుగుతుంది. బంగారం ఎక్కడైనా కచ్చితంగా ఒకే తీరులో ఉంటుంది. కానీ, వజ్రాల సంగతి అలా కాదు. ఎన్నో రకాలు, నాణ్యతలో వ్యత్యాసాలు ఉంటాయి. కాబట్టి, నిర్ణీత ధర ప్రకటించడం సాధ్యం కాకపోవచ్చు.
బంగారంతో పోలిస్తే.. వజ్రాభరణాలకు ఆదరణ ఎలా ఉంటోంది?
బంగారు ఆభరణాలు సంప్రదాయంతో ముడిపడినవి. ఇప్పుడు యువత తమ కోసం ఎక్కువగా విలువైన వజ్రాభరణాలు కొనేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. వారి అభిరుచికి తగ్గట్టే డిజైనర్ వజ్రాభరణాలను అందుబాటులోకి తెస్తున్నాం. మొత్తం రూ.2లక్షల కోట్ల ఆభరణాల మార్కెట్లో వజ్రాల మార్కెట్ విలువ రూ.40వేల కోట్ల వరకు ఉంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని చెప్పొచ్చు.
ఆభరణాలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారా?
ఏడాదిన్నర కాలంలో మా ఆన్‌లైన్ వ్యాపారం 5 రెట్లు పెరిగింది. రూ.30-40 వేల విలువైనవి ఆన్‌లైన్‌లో, అంతకన్నా విలువైనవి స్టోర్లకు వచ్చి కొనడానికి ఇష్టపడుతున్నారు. ఇంటి దగ్గరే ఉండి నగలు కొనాలనుకునే వారికోసం 'ట్రయల్ అట్ హోం' పేరుతో వీడియో కాల్‌లో వజ్రాల నగలు చూపుతున్నాం. ఆర్డరు ఇస్తే, ఇంటికి తీసుకెళ్లి వాటిని అందిస్తున్నాం.
మీ విస్తరణ ప్రణాళికలు ఎలా ఉన్నాయి?
ప్రస్తుతం మాకు దేశ వ్యాప్తంగా 58 స్టోర్లు ఉన్నాయి. 2025 నాటికి మొత్తం స్టోర్ల సంఖ్య 100, టర్నోవర్ రూ.1,000 కోట్లకు చేరాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో హైదరాబాద్‌లో కొత్తగా 6 స్టోర్లు ఉంటాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ స్టోర్లను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాం. ఒక్కో స్టోరుపై రూ.20 కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్నాం. డిజైనర్ ఆభరణాలకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఐపీఓకి వచ్చే అవకాశాలనూ పరిశీలిస్తున్నాం.
వజ్రాభరణాలు విక్రయించడంలో సులభ పద్ధతులను తీసుకొస్తున్నారా?
వినూత్న పద్ధతుల్లో వజ్రాభరణాలను విక్రయించేందుకు ఓరా సిద్ధమవుతోంది. నెలవారీ వాయిదాల్లో వీటిని కొనేందుకు వీలుంది. ఒక ఎన్‌బీఎఫ్‌సీతో దీనికోసం ఒప్పందం కుదుర్చుకున్నాం. కొత్తగా వజ్రాభరణాలను కొన్న వారు మా ద్వారా వాటిని అద్దెకు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. 2022 తొలి త్రైమాసికంలో దీన్ని ప్రారంభించే ప్రణాళిక ఉంది.
ఇదీ చదవండి:2022లో ఆ ఉద్యోగులకు భారీగా వేతనాల పెంపు!
భారత్‌తో కెయిర్న్ రాజీ- బిలియన్ డాలర్లు ఇస్తే కేసులు వాపస్!