దేశీయ క్యాబ్ సేవల సంస్థ 'ఓలా' ఎలక్ట్రిక్ స్కూటర్ (ఈ-స్కూటర్) కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ప్రణాళికను ఆవిష్కరించింది. ఈ మేరకు హైపర్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. దేశంలో విద్యుత్ వాహనాల వినియోగానికి తగిన వ్యవస్థను(ఎకోసిస్టమ్) నెెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు వివరించింది.
ఓలా నుంచి తొలి ఈ స్కూటర్..
జులైలో సరికొత్త ఈ-స్కూటర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ఓలా ప్రకటించింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా 400 నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఛార్జింగ్ స్టేషన్లను దూర ప్రాంతాల్లో కాకుండా, షాపింగ్ మాల్స్, ఐటీ పార్కులు, ఆఫీస్ కాంప్లెక్స్‌లు, కెఫేల వంటి ప్రదేశాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఓలా వివరించింది.
ఓలా స్కూటర్‌లో ఇన్‌స్టాలేషన్ అవసరం లేని హోమ్ ఛార్జర్ కూడా ఉంటుందని తెలిపింది. ఈ ఛార్జర్‌తో 18 నిమిషాల్లో 50% కి పైగా ఛార్జ్ చేయవచ్చని.. తద్వారా 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని పేర్కొంది.
ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే భారత్‌లో అనువైన ధరకే లభిస్తుందని మాత్రం తెలిపింది. విదేశీ మార్కెట్లకూ వీటిని ఎగుమతి చేయనుంది ఓలా.
తొలుత 100 నగరాల్లో..
ఇప్పటికే విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తి కేంద్రాన్ని తమిళనాడులో నెలకొల్పింది ఓలా. దీనిపై సుమారు రూ.2,400 కోట్ల పెట్టుబడి పెట్టింది.
'హైపర్ ఛార్జర్ నెట్‌వర్క్' కోసం.. సంవత్సరంలోనే దాదాపు 100 నగరాల్లో 5,000 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా 330 మిలియన్ డాలర్లతో తమిళనాడులో మెగా ఈ-స్కూటర్ ఫ్యాక్టరీని నెలకొల్పే యోచనలో ఉంది. ఫ్యాక్టరీ ప్రారంభ వార్షిక సామర్ద్యం 20 లక్షల యూనిట్లు.
"ఏదైనా ఎలక్ట్రిక్ వాహనం విజయవంతం కావాలంటే మౌలిక సదుపాయాలు కీలకం. భారత్‌లో విద్యుత్ మౌలిక సదుపాయాల అంతరాయాల్లో ఛార్జింగ్ నెట్‌వర్క్ ఒకటి. అందుకే ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసే వినియోగదారులకు మేము ఉత్తమ అనుభవాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. సమగ్ర ఛార్జింగ్ నెట్‌వర్క్ నిర్మాణంపై కీలక ప్రణాళికలు చేస్తున్నాం. ప్రపంచంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను సృష్టించడం ద్వారా.. 'ఈవీ' వినియోగదారులను ప్రోత్సహిస్తాం. దీనితో దేశంలో ఇతర కంపెనీలు కూడా విద్యుత్ వాహనాల తయారీని వేగవంతం చేస్తాయని ఆశిస్తున్నాం."
-భవీష్ అగర్వాల్, ఓలా ఛైర్మన్
ఇవీ చదవండి: ఓలా 'ఈ-స్కూటర్లు' వచ్చేస్తున్నాయ్!