ట్విట్టర్లో బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తుల్లో ఎలాన్ మస్క్ ఒకరు. ఆయన తరచుగా చేసే చిన్న చిన్న ట్వీట్లు తెగ వైరల్ అవుతుంటాయి. ఈ తరహాలోనే తొలినాళ్లలో ఉద్యోగం కోసం ప్రయత్నించిన విషయంపై మస్క్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ప్రణయ్ ట్వీట్..
1995లో ఎలాన్ మస్క్ ఒక ఇంటర్నెట్ కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడని మస్క్ సహచరుడు ప్రణయ్ పాథోల్ ట్వీట్ చేశారు. ఇందుకోసం రెజ్యుమేను పంపినప్పటికీ ఆయన తిరస్కరణకు గురయ్యాడని ప్రణయ్ తెలిపారు. మస్క్ ఎవరితోనైనా మాట్లాడటానికి చాలా సిగ్గుపడేవాడని.. అందువల్ల ఆయనకు ఎక్కడా ఉద్యోగం లభించలేదని రాసుకొచ్చారు. దీంతో సొంతంగా జిప్-2 అనే ఇంటర్నెట్ సంస్థను స్థాపించినట్లు వివరించారు. తాను సైతం ఎక్కడా ఉద్యోగం పొందలేకపోవడం వల్ల జిప్-2లో భాగమయ్యానని పాథోల్ పేర్కొన్నారు. అయితే ప్రణయ్ పాథోల్ ట్వీట్‌పై ఎలాన్ మస్క్ స్పందించారు. "నేను ఉద్యోగం పొందగలను, ఇంటర్నెట్ కంపెనీలోనే కాదు" అని బదులిచ్చారు. మస్క్ చేసిన ఈ ట్వీట్ కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. లైకులు, రీట్వీట్లు వెల్లువెత్తాయి.
జిప్-2 అనేది వార్తా పత్రికలకు ఆన్లైన్ సిటీ గైడ్‌ను అందించే సాఫ్ట్వేర్ సంస్థ. గ్లోబల్ లింక్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్‌గా 1995లో ఎలాన్ మస్క్, అతని సోదరుడు కింబల్ మస్క్ గ్రెగ్ కౌరితో కలిసి కాలిఫోర్నియాలో స్థాపించారు. అనంతరం 1999లో దీనిని కాంపాక్ కంప్యూటర్‌కు అమ్మేశారు. మొత్తంగా జిప్-2తో తన కెరీర్ ప్రారంభించిన మస్క్.. టెస్లా, పేపాల్, స్పేస్ఎక్స్ వంటి సంస్థలను ఇప్పుడు విజయవంతంగా నడిపిస్తున్నారు. అపర కుబేరుడిగా ఎదిగారు.
ఇవీ చదవండి: అదే నిజమైతే టెస్లాను మూసేస్తా: మస్క్