భారత్‌లో కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోన్న సంస్థలు కఠినమైన నిబంధనలన్నింటినీ అనుసరించే ట్రయల్స్ పూర్తి చేస్తాయని తెలిపారు ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కే.విజయరాఘవన్. అందులో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. రాఘవన్ వ్యాఖ్యలు ఐసీఎంఆర్- భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్.. ఆగస్టు 15లోగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని సూచిస్తున్నాయి.
వివేకానంద అంతర్జాతీయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు విజయ రాఘవన్.
" ఏ వ్యాక్సిన్‌కైనా మనుషులపై క్లినికల్ ట్రయల్స్ తొలి దశ సాధారణంగా 28 రోజులు పడుతుంది. అది పూర్తయిన తర్వాతే మిగతా దశలను ప్రారంభిస్తారు. ఇప్పటికే భారత్ బయోటెక్ వ్యాక్సిన్, జైడస్ కాడిలా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు ఇచ్చింది. కాబట్టి ఈ రెండు సంస్థల వ్యాక్సిన్లు కఠినమైన ప్రక్రియలను ఎదుర్కొని ట్రయల్స్‌ను పూర్తి చేస్తాయి. అందులో ఎలాంటి రాజీ లేదు. ఒకవేళ తక్షణమే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. తీవ్రంగా అనారోగ్యానికి గురైన వారికి ప్రాధాన్యం ఇవ్వటం వల్ల అది అందరికి అందేసరికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పడుతుంది."
- కే. విజయ్ రాఘవన్, ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు
ప్రస్తుతం భారత్ బయోటెక్- ఐసీఎంఆర్ భాగస్వామ్యంలో కోవాగ్జిన్ పేరుతో వైరస్‌కు వ్యాక్సిన్ రూపకల్పన జరుగుతోంది. ఈ వ్యాక్సిన్‌ను ఆగస్టు 15లోపు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కొన్ని రోజుల ముందు ఐసీఎంఆర్ ప్రకటించింది. ఈ అంశమై స్పందించిన రాఘవన్ జులై 10న క్లినికల్ ట్రయల్స్ తొలి దశ ప్రారంభమైందని.. అలాగే మిగతా 12 కేంద్రాల్లో ఒకేసారి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సాధారణంగా ఇంత తక్కువ సమయంలో అందుబాటులోకి రాదని చెప్పారు.
ప్రక్రియ వేగవంతం ఎలా?..
ఈ ప్రక్రియను వేగవంతం ఎలా చేస్తారు అనే ప్రశ్నకు బదులుగా.. తొలి, రెండో దశను ఒకేసారి నిర్వహిస్తారని, ఈ రెండు దశల్లో మనుషుల భద్రత, రోగనిరోధక శక్తి అంశాలపై దృష్టిసారిస్తారని తెలిపారు రాఘవన్. మూడో దశకు భారీ సంఖ్యలో ప్రజలు అవసరమవుతారని.. దానికి ఎక్కువ సమయం పడుతుందన్నారు. అయితే సమయాన్ని కుదించొచ్చని సూచించారు. సాధారణంగా ఈ ప్రక్రియ మొత్తానికి 5-10 ఏళ్లు పడుతుందని, కానీ, దానిని 12-15 నెలలకు తీసుకొస్తారని పేర్కొన్నారు. ఒకేసారి వివిధ దశలను నిర్వహిస్తున్నందున చాలా భారీగా ఖర్చు అవుతుందని తెలిపారు.
వాటితో పాటుగా ఉత్పత్తి, స్టాక్, సరఫరాలను అందుబాటులోకి తేవడం కూడా ఒకేసారి చెయ్యొచ్చని పేర్కొన్నారు రాఘవన్.
విమర్శలు
కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే ప్రక్రియను వేగవంతం చేయటంపై పలువురు నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. మహమ్మారుల కోసం తయారు చేసే వ్యాక్సిన్ల ప్రక్రియను వేగవంతం చేయటం అంతర్జాతీయ ప్రమాణాలను పాటించలేవని పేర్కొంటున్నారు.