భారత వ్యాపార వాతావరణం మెరుగవుతూనే ఉందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. పెట్టుబడులకు, సంపద సృష్టికి అత్యంత సులువైన దేశాల్లో ఒకటిగా భారత్‌ను చేర్చడానికి ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోందని ఆయన పేర్కొన్నారు. పలు దేశాలు పంపిన సమాచారంలో అవకతవకలు ఉండడంతో అంతర్జాతీయ 'డూయింగ్ బిజినెస్ రిపోర్ట్'ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించిన ఒక రోజు అనంతరం కాంత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్‌లో పెట్టుబడుల వాతావరణం సులభతరం, సరళతరంగా ఉందని ఆయన అన్నారు.
ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు సరళ నిబంధనలు
'ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు, వ్యాపారాలు, అంకురాలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సరళతరమైన, సమర్థవంతమైన నిబంధనలు ఉండేలా ప్రభుత్వంలో ఉన్న మేమందరం కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాం. తద్వారా ప్రపంచంలోనే పెట్టుబడులు పెట్టేందుకు సులభమైన దేశాల్లో ఒకటిగా భారత్ ఉండేలా చేయడమే మా లక్ష్యమ'ని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచ బ్యాంకు తాజా ర్యాంకింగ్ (సులభతర వాణిజ్యానికి అనువుగా ఉన్న దేశాల్లో) ప్రకారం.. భారత్ 14 ర్యాంకులు అధిగమించి 63వ స్థానంలో ఉంది. అయిదేళ్ల కాలం(2014-19)లో భారత్ 79 స్థానాలను ఎగబాకడం విశేషం.
దర్యాప్తు చేపట్టాలి
వివిధ దేశాలు పంపిన సమాచారంలో అవకతవకలు ఉండడంపై ప్రపంచ బ్యాంకు దర్యాప్తు చేయాలని.. సాధ్యమైనంత త్వరగా డూయింగ్ బిజినెస్ రిపోర్ట్‌ను తీసుకురావాలని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. అక్టోబరు 2017, 2019లో ప్రచురితమైన డూయింగ్ బిజినెస్ 2018, డూయింగ్ బిజినెస్ 2020 నివేదికల్లోని మార్పులకు సంబంధించిన పలు అవకతవకలు కనిపించాయని ప్రపంచ బ్యాంకు గురువారం పేర్కొంది.