పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను వేల కోట్లకు మోసగించి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. భారత్ రాకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అతడిని భారత్‌కు అప్పగించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో యూకే కోర్టు తీర్పు ఇవ్వగా.. ఇటీవల ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపింది. అయితే ఈ తీర్పుపై నీరవ్ మరోసారి యూకే హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తాజాగా పిటిషన్ దాఖలు చేశారు.
యూకే అంగీకారం..
దాదాపు రూ. 14వేల కోట్ల మోసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ భారత్‌కు తిరిగి రాకుండా ఉండేందుకు గతంలోనూ అనేక ప్రయత్నాలు చేశారు. భారత్‌లో తనకు న్యాయం జరగదని, తన మానసిక స్థితి సరిగా లేదంటూ నీరవ్ మోదీ బ్రిటన్ కోర్టుకు విన్నవించారు. అయితే, ఆయన చేసిన వాదనలను అక్కడి కోర్టు తోసిపుచ్చింది. భారత్‌కు అప్పగించినంత మాత్రనా.. అన్యాయం జరగదని న్యాయస్థానం స్పష్టం చేసింది. మనీలాండరింగ్ కేసులో భారత్ సమర్పించిన ఆధారాలు సరిపోతాయని.. అతడిని అప్పగించాలని ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తీర్పు వెలువరించింది. ఇటీవల యూకే హోంమంత్రిత్వశాఖ కూడా ఇందుకు అంగీకారం తెలిపింది.
2018 నుంచి బ్రిటన్ జైల్లోనే..
తప్పుడు ఎల్‌వోయూలతో పీఎన్‌బీని నీరవ్ మోదీ మోసగించిన వ్యవహారం 2018 జనవరిలో బయటపడింది. అయితే అప్పటికే అతడు దేశం విడిచి పారిపోయారు. 2018 డిసెంబర్‌లో నీరవ్ తమ దేశంలోనే నివసిస్తున్నాడని బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది. దీంతో అతడిని అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో 2019 మార్చిలో నీరవ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అక్కడి వాండ్స్‌వర్త్ జైల్లో నీరవ్ ఉంటున్నాడు. తనకు బెయిల్ మంజూరు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ బ్రిటన్ కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ సంస్థలు.. ఇప్పటికే అతడికి చెందిన పలు ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి.
ఇవీ చదవండి: నీరవ్ మోదీని అప్పగించేందుకు బ్రిటన్ అంగీకారం
భారత్ నుంచి లండన్ పరారైన నేరగాళ్లపై పుస్తకం