ఏడాదిలోగా ఈ-కామర్స్ రంగంలో నూతన జాతీయ విధానాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రంగంలో సంపూర్ణ వృద్ధే లక్ష్యంగా నూతన విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ కామర్స్ సంస్థలు, వాటాదారులతో సోమవారం రెండో సారి సమావేశమైన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
" ఈ కామర్స్ రంగంలో సంపూర్ణ వృద్ధిని సాధించేందుకు 12 నెలల్లోగా నూతన జాతీయ విధానాన్ని తీసుకొస్తాం."
-పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి
ఈ ఏడాది ఫిబ్రవరిలో జాతీయ ఈ కామర్స్ పాలసీ ముసాయిదాను విడుదల చేసింది ప్రభుత్వం. సీమాంతర డేటా ప్రవాహంపై పరిమితులను విధించేందుకు చట్టపరమైన, సాంకేతికమైన వ్యవస్థను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. వీటితో పాటు స్థానికంగా సున్నితమైన డేటాను సేకరించి విదేశాల్లో నిల్వ చేయడం వంటి వ్యాపారాలకు షరతులను విధించింది. అయితే ఈ ముసాయిదాలోని కొన్ని అంశాలపై పలు విదేశీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఫలితంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ముసాయిదాపై ఉన్న అభ్యంతరాలను తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కామర్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై గతంలో విడుదల చేసిన పత్రికా ప్రకటన కేవలం స్పష్టత కోసమేనని ఎఫ్డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) విధానంలో ఎలాంటి మార్పులు ఉండబోవని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఒడిశా: పట్టాలు తప్పిన సమలేశ్వరి ఎక్స్ప్రెస్