ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నాన్ గెజిటెడ్ అధికారుల నియామకాల్లో భారీ సంస్కరణలు చేపట్టనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్ 2020ను ప్రవేశపెట్టిన నిర్మలా.. నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి జాతీయ స్థాయి రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు.
"పబ్లిక్, ప్రవేటు రంగాల్లోని బ్యాంకుల్లో ఉన్న నాన్-గెజిటెడ్ పోస్టుల నియామక ప్రక్రియల్లో భారీస్థాయి సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఒకే రకమైన పోస్టుల కోసం.. అనేక ఏజెన్సీలు నిర్వహించే అనేక పరీక్షలకు అభ్యర్థులు హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొంది. దీని వల్ల సమయం వృథా అవుతోంది. యువతకు ఎంతో నష్టం కలుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది."
--- నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి.
ఈ పరీక్షల కోసం జాతీయస్థాయిలో ఆన్లైన్లోనే కామన్ ఎలిజబులిటీ టెస్టును నిర్వహించనున్నట్టు తెలిపారు ఆర్థికమంత్రి. ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ ఓ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.