మార్కెట్లో ఉన్న మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేవే 'ఫండ్ ఆఫ్ ఫండ్స్'. వివిధ రకాల అసెట్స్లలో ఇవి పెట్టుబడులు పెడతాయి. కాబట్టి వీటిలో పెట్టుబడితో పోర్ట్ ఫోలియోను ఎక్కువ డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు. స్వల్ప కాలంలో హెచ్చుతగ్గులు, అధిక అస్థిరత.. రెండింటి నుంచి వీటి ద్వారా రక్షణ పొందవచ్చు.
సాధారణ మ్యూచువల్ ఫండ్లలో పెట్టే మొత్తాన్నే ఇందులోనూ మదుపు చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో లానే నిపుణుల ద్వారా ఫండ్ పర్యవేక్షణ ఉంటుంది.
రకాలు..
'అసెట్ అలొకేషన్ ఫండ్'- వివిధ రకాల పెట్టుబడి సాధనాలపై పెట్టుబడులు పెట్టేందుకు వీలుంటుంది. ఈక్విటీ, డెట్‌తో పాటు బంగారం, కమొడిటీస్ లాంటి వాటిపైనా పెట్టుబడి పెట్టేందుకు ఉపయోగపడుతుంది.
విదేశీ లేదా అంతర్జాతీయ ఫండ్ ఆఫ్ ఫండ్స్- దీని ద్వారా విదేశీ కంపెనీలకు సంబంధించిన మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు లేదా ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టొచ్చు.
గోల్డ్ ఎఫ్ఓఎఫ్- బంగారు ఫండ్లలో పెట్టుబడి పెట్టే వాటిని గోల్డ్ ఎఫ్ఓఎఫ్ అంటారు. ఇవి భౌతిక బంగారంతో పాటు గోల్డ్ మైనింగ్ చేసే కంపెనీలలో కూడా పెట్టుబడులు పెడతాయి.
ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్- ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడతాయి.
రిస్కు?
వీటిలో వ్యయం సాధారణ డెట్ లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కంటే ఎక్కువగా ఉంటుంది. డైవర్సిఫికేషన్ మంచిదే అయినప్పటికీ ఇది మరీ ఎక్కువ కావటం వల్ల అనుకున్న ఫలితాలు సాధించలేమని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువ డైవర్సిఫికేషన్ వల్ల ఇతర ఫండ్లతో పోల్చితే ఆ ఫండ్ మంచి ప్రదర్శన కనబరచకపోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నందున.. ఒకేదానిలో ఒకటి కంటే ఎక్కువ సార్లు పెట్టుబడి పెట్టే అవకాశం కూడా లేకపోలేదు.
ఎవరికి సరిపోతాయి?
ఒకటి కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఫండ్ ఆఫ్ ఫండ్స్ మంచి ఎంపికగా చెబుతున్నారు విశ్లేషకులు. రిస్కు తక్కువ ఉండాలనుకునే వారికి కూడా ఇవి సరిపోతాయంటున్నారు. ఇతర పెట్టుబడుల వలే ఇవి కూడా దీర్ఘ కాలంలో ఎక్కువ రాబడిని అందిస్తాయి.
చిన్న మొత్తంలో అంతర్జాతీయ ఈక్విటీలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఇంటర్నేషనల్ ఎఫ్ఓఎఫ్లు ఉపయోగపడతాయి.
ఇదీ చదవండి: మల్టీ క్యాప్..ఫ్లెక్సీ క్యాప్..పెట్టుబడికి ఏది మేలు?