కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. సుదీర్ఘ కాలం లాక్‌డౌన్ అనంతరం... ఆయా దేశాల్లో వైరస్ తగ్గుముఖం పట్టడం వల్ల సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అమెరికా రాష్ట్రాల్లో వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించేందుకు అనుమతించింది ఆ దేశం.
అయితే.. వైరస్ తాకిడి ఎక్కువగా గల కాలిఫోర్నియాలో మాత్రం ఇంకా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా అక్కడి ప్రముఖ టెస్లా ఎలక్ట్రిక్ కంపెనీపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో తీవ్ర అసహనం వ్యక్తిం చేసిన ఆ సంస్థ సీఈఓ ఎలన్ మస్క్.. స్థానిక ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమ సంస్థ పునరుద్ధరణకు అనుమతివ్వకపోతే.. ప్రధాన కార్యాలయాన్ని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ లేదా నెవాడాకు తరలిస్తామని హెచ్చరించారు.
గతంలోనూ ఇలాగే..
మే తొలి వారంలోనే టెస్లా ఉత్పత్తిని పునరుద్ధరించాలని మస్క్ భావించినప్పటికీ.. అక్కడి స్థానిక అధికారులు అందుకు అనుమతించలేదు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురైన ఎలన్... చైనాలో తమ కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎలన్ మస్క్ ఇలాంటి ఘాటైన వ్యాఖ్యలు చేయడం ఇదేం కొత్తకాదు. గతంలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యారు. ఇటీవల తన కంపెనీ షేర్లు అత్యధిక ధర పలుకుతున్నాయని చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారం రేగాయి. ఈ దెబ్బతో కంపెనీ షేర్లు ఏకంగా సుమారు 10 శాతం మేర పడిపోయాయి.
ఇదీ చదవండి: ఆ వివరాలు గోప్యంగా ఉంచితేనే మీరు సేఫ్!