కరోనా మొదటి, రెండో దశల కారణగా ప్రభావితమైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను ఆదుకునేందుకు భారీ ఉపశమన ప్యాకేజీని ప్రకటించాలని పరిశ్రమల సంఘం(అసోచామ్) డిమాండ్ చేసింది. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు ఉపశమన ప్యాకేజీ అవసరమని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రణాళికలతో కలిసి రావాలని అసోచామ్ అధ్యక్షుడు వినీత్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎంఎస్‌ఎంఈల పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలను సూచించారాయన.
- బ్యాంకులు, ఎంఎస్‌ఎంఈల మూలధన పరిమితిని 20 శాతానికి పెంచాలి.
- ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి మొండిబకాయిల(ఎన్‌పీఏ) పునర్వ్యవస్థీకరణ జరగాల్సిన అవసరం ఉంది.
- వీధి వ్యాపారులు, చిన్న దుకాణదారులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించేలా.. మూలధన రుణాలను అందించాలి.
- గ్రామీణ రంగ వృద్ధికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి.
ఇదీ చదవండి: డీలాపడ్డ ఎంఎస్‌ఎంఈలకు నిధులిస్తేనే జవసత్వాలు!
ఇదీ చదవండి: కరోనా దెబ్బతో సుడిగుండంలోనే ఎమ్ఎస్ఎమ్ఈలు
కరోనా మొదటి దశ వల్ల కలిగిన నష్టాల నుంచి పెద్ద కంపెనీలు వేగంగానే బయటకు రాగలిగాయని.. అయితే రెండోదశ ప్రభావంతో ఆర్డర్లు లేక ఇప్పుడు అవి కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాయని అగర్వాల్ వివరించారు.
"వస్తువుల వినియోగం పెరిగిన కారణంగా వాటి ధరలు సైతం పెరిగాయి. ఫలితంగా ఉత్పత్తి వ్యయాలపై ప్రభావం పడింది. మొత్తం మీద ఎంఎస్ఎంఈలపై ప్రతికూల ప్రభావం పడింది. "మొదటి దశ కారణంగా వస్తు సరఫరా గొలుసుకు అంతరాయం కలిగినట్లుగా.. రెండో దశలో జరగలేదు. కర్మాగారాలు, పరిశ్రమలు చాలా వరకు పనిచేస్తున్నాయి. అయితే.. ఎంఎస్ఎంఈలపై కచ్చితంగా ప్రభావం మాత్రం ఉంటుంది. ఇక.. ఆతిథ్యం, పర్యటకం వంటి సేవా రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
-వినీత్ అగర్వాల్, అసోచామ్ అధ్యక్షుడు
ఇవీ చదవండి: కరోనా దెబ్బకు 'ఎంఎస్ఎంఈ'ల ఉనికే ప్రశ్నార్థకం..?