ఎదురుచూపులకు తెరపడింది. దాదాపు ఏడాదిగా ఎప్పుడెప్పుడా అని వేచిచూస్తున్న రిలయన్స్ జియో గిగాఫైబర్ రానే వచ్చింది. సెప్టెంబర్ 5న వాణిజ్య సేవలు ప్రారంభమయ్యాయి. టారిఫ్ ప్లాన్లు, నియమనిబంధనలు బయటకు వచ్చాయి.
జియో గిగాఫైబర్ ప్లాన్లు రూ.699 నుంచి మొదలయ్యాయి. 100ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ స్పీడ్ వరకు వేర్వేరు కేటగిరీల ఆధారంగా నెలవారీ టారిఫ్‌లు ఉన్నాయి. కొత్త కనెక్షన్ తీసుకోవాలంటే రూ.2500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఇందులో రూ.1000 ఇన్స్టలేషన్ ఛార్జ్. ఎప్పటికీ తిరిగిరాదు. మిగిలిన రూ.1500 రిఫండబుల్.
రిలయన్స్ జియో గిగా ఫైబర్ ప్లాన్లు విశ్లేషిస్తే కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి.
సెట్ టాప్ బాక్స్ ఉచితం... కానీ...
"జియో సెట్ టాప్ బాక్స్... ఓ అద్భుతం"... రిలయన్స్ వర్గాలు పదేపదే చెప్పే మాట. అందుకు తగినట్లే అందులో అనేక కీలక ఫీచర్లు ఉన్నాయి. వీడియో కాలింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్, గేమింగ్, మిక్స్డ్ రియాల్టీ... ఇలా అధునాతన సౌకర్యాలన్నీ సెట్ టాప్ బాక్స్‌లో ఉన్నాయి.
ప్రతి చందాదారుడికి సెట్ టాప్ బాక్స్ ఉచితంగా అందిస్తామని జియో ప్రకటించింది. ఇక్కడే ఓ చిక్కు ఉంది. సెట్ టాప్ బాక్స్‌లో ఉన్న ఫీచర్లు అన్నింటినీ కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు... టీవీ ఛానళ్లు చూడడం మినహా.
టీవీ ఛానళ్లు చూడాలంటే మాత్రం... స్థానిక కేబుల్ ఆపరేటర్ నుంచి కనెక్షన్ తీసుకుని, జియో సెట్ టాప్ బాక్స్‌కు అనుసంధానం చేసుకోవాల్సిందే.
ఎందుకలా..?
ఐపీటీవీ(ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ) విధానంలో కేబుల్ టీవీ సేవలు అందించాలని తొలుత భావించింది జియో. కానీ... సాధ్యపడలేదు. ఐపీటీవీ సేవలు తీసుకొస్తే లోకల్ కేబుల్ ఆపరేటర్ల వ్యాపారం దెబ్బతింటుందని తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందుకే వ్యూహం మార్చింది జియో.
కేబుల్ నెట్వర్కింగ్లో దిగ్గజ సంస్థలైన హాత్వే, డెన్ నెట్‌వర్క్‌లో ఇప్పటికే మెజార్టీ వాటా కొనుగోలు చేసింది రిలయన్స్. ఇతర స్థానిక కేబుల్ ఆపరేటర్లూ గిగాఫైబర్‌లో భాగస్వాములై, జియో సెట్ టాప్ బాక్స్ ద్వారా టీవీ ఛానళ్లు అందించాలని కోరుతోంది ఆ సంస్థ. ఇప్పటివరకు ఎంతమంది లోకల్ కేబుల్ ఆపరేటర్లు గిగాఫైబర్‌లో భాగస్వాములు అయ్యారన్న అంశంపై స్పష్టత లేదు.
ఇదీ చూడండి:- 'సవాళ్లు అధిగమించేందుకు సాధ్యమైనంత సాయం'