వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23) భారత వృద్ధి రేటు అంచనాలను 60 బేసిస్ పాయింట్లు మేర(0.60%) పెంచింది మోర్గాన్ స్టాన్లీ . అన్ని రంగాల్లో వినియోగం పుంజుకునే అవకాశం ఉన్నందున 7.8 శాతం వృద్ధి రేటు నమోదుకావచ్చని అంచనా వేసింది. ‘దేశంలో అర్హులైన ప్రజలందరికీ కొవిడ్-19 టీకా వేయడం 2022 జనవరి- మార్చిలో పూర్తయ్యే అవకాశం ఉంది. వస్తు, సేవా రంగాల్లో వినియోగం పుంజుకునేందుకు ఇది తోడ్పడుతుంద’ని మోర్గాన్‌స్టాన్లీ అభిప్రాయపడింది. 2022 రెండో అర్ధభాగం నుంచి ప్రైవేట్ రంగ మూలధన వ్యయాలు పెరిగే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. సామర్థ్య వినియోగం మెరుగవ్వడం, ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి రావడం, సంస్కరణలు ఇందుకు దోహదం చేస్తాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 10.3 శాతం లభించవచ్చన్నది మోర్గాన్ స్టాన్లీ అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా (9.5%) కంటే ఇది ఎక్కువ. 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిరేటు 7.2 శాతంగా నమోదుకావచ్చని సంస్థ అంచనా వేస్తోంది.
అవరోధాలు తాత్కాలికమే
దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న సరఫరా అవరోధాలు తాత్కాలికమేనని, ద్రవ్యోల్బణం దిగివచ్చే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన నిత్యావసరాల ధరలు తగ్గడాన్ని ఉదాహరణగా తెలిపింది. 2021-22 మొత్తంమీద ద్రవ్యోల్బణం సగటున 5.3%, 2022-23లో 4.7% మేర నమోదుకావచ్చని అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపరంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నందున.. కొవిడ్-19 పరిణామాల సమయంలో తీసుకున్న అసాధారణ పరపతి విధాన నిర్ణయాలను దశలవారీగా ఉపసంహరించుకోవడం అనివార్యమని పేర్కొంది. మిగులు నిధుల లభ్యత ఉపసంహరణపై ఆర్‌బీఐ చేసిన ప్రకటన, ఈ దిశగా పడిన తొలి అడుగు అని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.
ఇదీ చదవండి: మస్క్ తెలివి.. ఒక్క ట్వీట్‌తో రూ.15వేల కోట్ల పన్ను ఆదా!