కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థకు నూతన జవసత్వాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో భాగంగా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 3 లక్షల కోట్లు కేటాయించింది.
అయితే తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలపై ఈ ప్యాకేజీ ఏ మాత్రం ప్రభావం చూపలేదని నిపుణులు చెబుతున్నారు. ఎంఎస్ఎంఈలలో ఉత్తేజం నింపడంలో ప్యాకేజీ విఫలమైందని విశ్లేషిస్తున్నారు.
రెండు నెలల పాటు లాక్డౌన్ విధించడం వల్ల అమ్మకాలు లేక చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎస్ఎంఈ)లు తీవ్ర నగదు కొరత ఎదుర్కొంటున్నాయని భారత సూక్ష్మ, మధ్య తరహా, లఘు పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు అనిమేశ్ సక్సేనా గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే వారికి అతిపెద్ద సంక్షోభమని పేర్కొన్నారు. ఈ సమయంలోనూ వేతనాలు చెల్లించడం సాధ్యం కాదని చెబుతున్నారు.
"లాక్డౌన్ విధించిన కాలంలోనూ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడం వల్ల ఎంఎస్ఎంఈ రంగానికి మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. దేశంలో 12 కోట్ల మందికి ఎంఎస్ఎంఈలు ఉపాధి కల్పిస్తున్నాయి. ఏప్రిల్ మే నెలల్లో ఎలాంటి వ్యాపారం జరగకపోయినా.. జీతాలు చెల్లించాల్సి వస్తోంది. విద్యుత్ బిల్లులు, అద్దె వంటి ఇతర స్థిర వ్యయాలు కూడా చెల్లించాలి. రెండు నెలల్లోనూ అమ్మకాలు సున్నాకు పడిపోవడం వల్ల ఎస్ఎంఈలు వేతనాలు చెల్లించే స్థితిలో లేవు."
--అనిమేశ్ సక్సేనా, ఎంఎస్ఎంఈ సమాఖ్య అధ్యక్షుడు
ఎంఎస్ఎంఈ రంగానికి రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు వ్యవహరించే విధానంలోనూ సమస్యలు ఉన్నాయని సక్సేనా పేర్కొన్నారు.
"బ్యాలెన్స్ షీట్ల వివరాలు, ఆర్డర్ పుస్తకాలు, ఇతర అంశాలను ఆధారంగా చేసుకొని బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఆర్డర్ బుక్ పటిష్ఠంగా లేకపోతే, ఇతర అంశాలు ప్రభావవంతంగా లేకుంటే రుణాలను తిరస్కరించే అవకాశం ఉంది. ఎస్ఎంఈల లోన్లకు సంబంధించి రుణ అర్హతను పరిశీలించాల్సిన అవసరం లేదని బ్యాంకులకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి."
--అనిమేశ్ సక్సేనా, ఎంఎస్ఎంఈ సమాఖ్య అధ్యక్షుడు
ఎంఎస్ఎంఈలకు కేంద్రం ప్రకటించిన రూ. 3 లక్షల కోట్ల హామీ లేని రుణాలకు సంబంధించిన మార్గదర్శకాల్లోనూ కొన్ని చిక్కులు ఉన్నట్లు సక్సేనా పేర్కొన్నారు.
"పథకంలో భాగంగా వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్‌పై ప్రభుత్వం పరిమితి విధించింది. ఫిబ్రవరి 29 నాటికి ఎంఎస్ఎంఈల అవుట్‌స్టాండింగ్ మొత్తంపై 20 శాతం పరిమితి విధించింది. అవుట్‌స్టాండిగ్ మొత్తంపై కాకుండా కంపెనీకి మంజూరు చేసిన మొత్తంలో 20 శాతం ఉండాలని మేం డిమాండ్ చేశాం."
--అనిమేశ్ సక్సేనా, ఎంఎస్ఎంఈ సమాఖ్య అధ్యక్షుడు
ఫిబ్రవరి 29నాటికి ఎలాంటి బకాయిలు లేని ఎస్ఎంఈలకు ఈ నిబంధన వ్యతిరేకంగా ఉందని సక్సేనా పేర్కొన్నారు. ఈ నిబంధన వల్ల వారు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోలేకపోతున్నారని అన్నారు.
వారికే ప్రయోజనం
ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు చంద్రకాంత్ సాలుంకే ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌కు ముందువరకు ఎలాంటి బకాయిలు లేని ఎంఎస్ఎంఈలకు ప్యాకేజీ ప్రయోజనకరంగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
"అన్ని ఎస్ఎంఈలు అప్పు తెచ్చుకున్న నగదుపై ఆధారపడి పనిచేయవు. ఇప్పటికే రుణాలు తీసుకున్న ఎస్ఎంఈలకే ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ప్రయోజనకరంగా ఉంటుంది."
-చంద్రకాంత్ సాలుంకే, ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు
బ్యాంకింగ్ వ్యవస్థ.. ఎంఎస్ఎంఈలకు వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్యానించారు చంద్రకాంత్. లోన్లు తిరిగి చెల్లించే విషయంలో ఎస్ఎంఈల డిఫాల్ట్‌ను బ్యాంకులు ఉద్దేశపూర్వక ఎగవేతగా పరిగణిస్తున్నాయని పేర్కొన్నారు.
(రచయిత-కృష్ణానంద్ త్రిపాఠి)