స్పెయిన్ బార్సిలోనాలో జరగాల్సిన 2020 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' రద్దు అయ్యింది. కొవిడ్-19 వైరస్ అంతకంతకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య భద్రత రీత్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రపంచ టెలికాం పరిశ్రమ సంస్థ జీఎస్ఎం అసోసియేషన్ తెలిపింది.
2006 నుంచి ఏటా స్పెయిన్‌లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వాలు, మంత్రులు, విధాన నిర్ణేతలు, ఆపరేటర్లు, పరిశ్రమ పెద్దలు.... టెలికాం, మొబైల్ రంగాల్లో వస్తున్న సాంకేతిక మార్పులను, పరిణామాలను విస్తృతస్థాయిలో చర్చిస్తారు.
ఆదరణ కరవు..
కొవిడ్-19 నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జీఎస్ఎమ్ఏ బోర్డులో ఉన్న సంస్థలతో సహా, కొంత మంది స్పాన్సర్లు, ప్రముఖ ఎగ్జిబిటర్లు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. వీటిలో వొడాఫోన్, సిస్కో, ఎల్జీ, వివో, ఎన్టీటీ డొకోమో, సోనీ, అమెజాన్, ఫేస్బుక్, మీడియాటెక్, ఇంటెల్, ఎన్విడియా మొదలైన ప్రముఖ సంస్థలు ఉన్నాయి.
2021పై ఆశాభావం
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ రద్దు నిర్ణయాన్ని.. ఆతిథ్యం ఇస్తున్న బార్సిలోనా వర్గాలు గౌరవిస్తాయని, అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నట్లు జీఎస్ఎమ్ఏ పేర్కొంది. 2021లో ఇక్కడే మరలా ఈ పెద్ద ఈవెంట్‌ను నిర్వహించడానికి పరస్పర సహకారం కొనసాగుతుందని జీఎస్ఎమ్ఏ స్పష్టం చేసింది. వైరస్‌తో విలవిలలాడుతున్న ప్రజలకు మా సానుభూతి తెలుపుతున్నామని జీఎస్ఎమ్ఏ ప్రకటించింది.
ఇదీ చూడండి: 'సాటిలేని వారసత్వం ఎయిర్ఇండియా సొంతం'