అధిక ధరలైనా సరే చెల్లించి విద్యుత్తు వాహనాలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని భారత్‌లో మెజారిటీ ప్రజలు తెలిపినట్లు ఓ ప్రముఖ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో 9 వేల మందిపై ఈవై అనే కన్సల్టెన్సీ సంస్థ సర్వే నిర్వహించింది. వీరిలో 1000 మంది భారత్ నుంచి ఉన్నారు. విద్యుత్తు వాహనాలకు 20 శాతం అధిక ధరలు చెల్లించేందుకు సిద్ధమని వీరిలో 90 శాతం మంది తెలిపారు.
ఇక భారత్‌లో ప్రతి 10 మందిలో ముగ్గురు విద్యుత్తు లేదా హైడ్రోజన్ కారుని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపారు. అలాగే ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 100 నుంచి 200 మైళ్లు వెళ్లగలిగే సామర్థ్యం ఉండాలని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. పర్యావరణ మార్పులను దృష్టిలో పెట్టుకునే స్వచ్ఛ ఇంధన వాహనాలపై మొగ్గు చూపుతున్నట్లు ఎక్కువ మంది తెలిపారు. అలాగే కొవిడ్ మూలంగా వాతావరణ మార్పులను పరిష్కరించడం ఎంత ముఖ్యమో తెలిసిందన్నారు. పర్యావరణ మార్పుల దుష్ర్పభావాలను తగ్గించడం తమ బాధ్యతని 67 శాతం మంది తెలిపారు. ఇక అది విద్యుత్తు వాహనాల వల్ల సాధ్యమని 69 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:రూ.6,322కోట్లతో ఉక్కు పరిశ్రమకు ఊతం!