Maruti Suzuki New Baleno: ప్రీమియం హ్యాచ్‌బాక్ బాలెనో కొత్త వెర్షన్ బుకింగ్స్‌ను సోమవారం ప్రారంభించినట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. రూ.11,000 చెల్లించి ఈ లగ్జరీ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెలలోనే దీన్ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది.
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ విక్రయాల్లో మరుతీ సుజుకీ 23శాతం వాటాలో ఉన్నత స్థితిలో ఉందని, బాలెనో కొత్త వెర్షన్ దాన్ని మరింత పెంచుతుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. హ్యూండాయ్ ఐ20, టాటా అల్ట్రోజ్, ఫోక్స్‌వాగన్ పోలోకు గట్టి పోటీ ఇస్తుందని పేర్కొంది.
'ఈ మోడల్ అనేక అత్యాధునిక ఫీచర్లతో వస్తోంది. గతంలో తక్కువ ఫీచర్లు ఉన్నందుకు విమర్శలు వచ్చాయి. న్యూ బాలెనోలో అన్ని సదుపాయాలు ఉంటాయి. ఈ సెగ్మెంట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫీచర్ల కంటే ఇంకా ఎక్కువగానే జత చేశాం. ఈ మార్పులతో కొత్త బాలెనోకు మరింత ఆదరణ లభిస్తుందని నమ్మకంగా ఉన్నాం' అని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.
కొత్త బాలెనో అప్డేటెడ్ ప్లాట్‌ఫాం, కొత్త ఎక్స్టీరియర్, ఇంటీరియర్, కొత్త పెట్రోల్ ఇంజిన్, 22కి.మీకుపైగా మైలేజ్‌తో వస్తుందని సంస్థ తెలిపింది.
బాలెనో 2015లో విడుదలైంది. 2021 నవంబర్ నాటికి 10 లక్షల విక్రయాలు జరిగాయి. కారు విక్రయాల్లో ఇదే రికార్డు అని సంస్థ చెప్పింది. ఇప్పుడు దీన్ని కొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకొస్తోంది.
ఇదీ చదవండి: వడ్డీ రేట్ల పెంపు ఖాయమా? నిపుణుల మాటేంటి?