దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత లాభం తగ్గింది. 66 శాతం క్షీణించి రూ.487 కోట్లుగా నమోదైంది. వ్యయభారం పెరగడం సహా చిప్‌ల కొరత లాభాల క్షీణతకు దారి తీసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.1,420 కోట్లు. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.18,756 కోట్లుగా ఉండగా.. ఈసారి అది రూ.20,551 కోట్లకు చేరింది.
వార్షిక ప్రాతిపదికన ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అమ్మకాలు 3 శాతం తగ్గి 3,79,541 యూనిట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇవి 3,93,130 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయ విపణిలో విక్రయాలు 3,20,133 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు మాత్రం 59,408 యూనిట్లకు చేరాయి. కంపెనీ చరిత్రలో రెండో త్రైమాసికంలో ఎగుమతులు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. మొత్తం 1.16 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. చిప్‌ల కొరత వల్ల సాధ్యం కాలేదని సంస్థ పేర్కొంది. స్టీల్, అల్యూమినియం సహా ఇతర కీలక లోహాల ధరలు పెరగడం ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు పేర్కొంది.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో 7,33,155 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో ఎగుమతులు 1,04,927 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఇవీ చదవండి: