ఒంటరి జీవితంలో డబ్బు ఉన్నా లేకున్నా ఇబ్బంది లేదు. కానీ, పెళ్లయ్యాక సిరి సంపదలు కావాల్సిందే. అయ్యే ఖర్చులకు తగ్గ ఆదాయం ఆర్జించడం తప్పనిసరి కూడా. వివాహానంతరం అవధులు లేని ఆనందం జీవితాంతం కొనసాగాలంటే.. పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత కొత్త దంపతులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే.
01. ఆస్తి లెక్కలే చాలవు..
పెళ్లికి ముందు సాధారణంగా అబ్బాయి, అమ్మాయి ఆస్తుల గురించే ఆరా తీస్తుంటారు. కానీ, వారి ఖర్చు పెట్టే మనస్తత్వం, సంపాదనలో ఎంత దాస్తున్నారు అనే లెక్కలు చూడరు. అస్సలు ఖర్చు పెట్టని పిసినారులా.. విలాసాలకు దుబారా చేసే వారా అని తెలుసుకోరు. అబ్బాయి, అమ్మాయి జీతం ఎంత అని అడుగుతారు కానీ, ఖర్చు పెట్టగా మిగిల్చేది ఎంత అని ప్రశ్నించరు. ఇప్పటివరకూ ఎంత మిగిల్చాడని అడగరు. అప్పుల గురించి ఆరా తీయరు. ఖర్చు ఎక్కువ పెట్టినా.. తక్కువ పెట్టినా ఏదీ తప్పు కాదు. కానీ, ఖర్చులు, పొదుపు, పెట్టుబడుల విషయంలో అమ్మాయి, అబ్బాయిలకు భిన్న మనస్తత్వాలు ఉంటేనే సమస్య. కాబట్టి, పెళ్లికి ముందే కాబోయే దంపతులు కాస్త డబ్బు విషయాలనూ మాట్లాడుకోవడం ఈ రోజుల్లో తప్పనిసరి. డబ్బు గురించి ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులోనూ ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. వీలైతే.. ఇద్దరి సిబిల్ నివేదికలను పరిశీలించడమూ మంచిదే.
02. అతి ఆర్భాటం వద్దు..
వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎవరి తాహతుకు తగ్గట్టు వారు తమ పిల్లల వివాహాలు జరిపిస్తుంటారు. కొంతమంది అబ్బాయిలు/అమ్మాయిలు తాము సొంతంగా సంపాదించిన డబ్బుతోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. పెళ్లి ఖర్చులకు తల్లిదండ్రులు ముందు జాగ్రత్తగా పొదుపు, పెట్టుబడులు చేసి, ప్రణాళికతో ఉంటే.. ఆ మొత్తాన్ని ఖర్చు చేయడంలో తప్పు లేదు. కానీ, అప్పు చేసి వేడుకలు చేసుకోవడం ఎంత వరకూ సమంజసమో ఆలోచించుకోవాలి.
03. ఆనందాల్ని వదులుకోవద్దు.. కానీ..
పెళ్లయిన కొత్తలో ప్రతి రూపాయి ఆచితూచి ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటే.. జీవితాంతం ఉండాల్సిన మధురానుభూతులు కోల్పోతారు. కాబట్టి, వివాహం తర్వాత ఉండే కొన్ని ఖర్చులను పెళ్లి వ్యయాల ప్రణాళికలోనే చేర్చాలి. తమకున్న ఆదాయ భద్రత ప్రకారం మూడు నుంచి ఆరు నెలల ఖర్చులను అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని అత్యవసరాల్లో తప్ప ముట్టుకోకూడదు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడానికీ, పరస్పర అవగాహనతో పరిణితికి కొన్ని విలాసాలు అవసరాలుగా పరిణమిస్తాయి. ఆ ఆనందానుభూతులకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
04.పెరగాలి బీమా
జంటగా మారిన మీకు బాధ్యత పెరుగుతుంది. కాబట్టి, మీ వార్షికాదాయానికి కనీసం 8, 10 రెట్లు జీవిత బీమా ఉండేలా టర్మ్ పాలసీ తీసుకోండి. పిల్లలు పుట్టాక మీ జీవిత బీమాను ఏడాది ఆదాయానికి 10, 12 రెట్లకు పెరగాలి. ఇద్దరిలో ఎవరికి ఆదాయం ఉంటే వారు జీవిత బీమా తీసుకోక తప్పదు. ఇద్దరికీ వేర్వేరు ఆరోగ్య బీమా పాలసీలు ఉంటే, ఇద్దరికీ కలిపి ఒకే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే ప్రీమియం తగ్గుతుందేమో చూడండి.
05. పొదుపు పెంచాలి..
పెళ్లయిన కొన్నాళ్ల వరకూ గృహోపకరణాలు కొనడం, ఇతర కొన్ని తప్పనిసరి ఖర్చులు చేయాల్సి రావచ్చు. కాబట్టి, అధిక ఆదాయం లేని వారు వివాహం అయిన కొత్తలో దీర్ఘకాలిక పొదుపు కోసం ఆదాయంలో కనీసం పదిశాతం కేటాయించాలి. రెండు, మూడేళ్ల తర్వాత మీ ఆదాయంలో ఆదా మొత్తాన్ని పెంచాలి. మగవారి ఆదాయంలో కనీసం 25 శాతం, మహిళల ఆదాయంలో కనీసం 50 శాతం పొదుపు, పెట్టుబడులుగా మళ్లించడం మంచిది.
06. పిల్లలు.. ఇల్లు..
ఆదాయం, తమ వయసులకు అనుగుణంగా పిల్లలను జీవితంలోకి ఎప్పుడు ఆహ్వానించాలో నిర్ణయించుకోవాలి. తల్లిగా మారిన కొత్తలో కొన్నాళ్లు ఆదాయానికి అంతరాయం ఏర్పడవచ్చు. ఆ సమయాన్ని మినీ రిటైర్మెంట్‌గా భావించి, తమ ఆదాయ వ్యయాల్లో ఏ మార్పులు చేసుకోవాలో ఆలోచించుకోవాలి. ఇల్లు ఎప్పుడు కట్టాలి.. అందుకు కావాల్సిన మార్జిన్ మనీ ఎలా అనేది చర్చించుకోవాలి. ఇద్దరూ ఆదాయ పన్ను పరిధిలో ఉంటే ఇద్దరి పేరుతో ఇల్లు కొనడంవల్ల ఇద్దరికీ పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
07. ప్రణాళిక వేసుకోవాలి..
ఆర్థిక ప్రణాళిక నిరంతర ప్రక్రియ. మూడేళ్లలో ఏమి అవసరం.. ఐదేళ్లలో ఏది కావాలి.. పదేళ్లలో చేయాల్సిన పనులేమిటి? ఇలా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. వాటిని ఎలా నెరవేర్చుకోవాలో రాసుకోవాలి. కనీసం ఆరు నెలలకోసారి తాము అనుకున్న ఆర్థిక మార్గంలో వెళ్తున్నదీ లేనిదీ సరి చూసుకుంటూ ఉండాలి. ఒకరి ఆలోచనలు మరొకరు గౌరవించాలన్నది ఇతర విషయాలకే కాదు.. డబ్బుకూ వర్తిస్తుందని మర్చిపోవద్దు.
ఇదీ చూడండి: రోగనిరోధక శక్తిని తగ్గించే అలవాట్లు ఇవే!