బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్(Gold Hallmark) మంగళవారం నుంచి అమలులోకి రానుంది. కరోనా నేపథ్యంలో ఈ గడువు పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. పసిడి స్వచ్ఛతను నిర్ధరించే ఈ హాల్‌మార్క్ పద్ధతిని అమలు చేయాలని 2019 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వ్యాపారులకు 2021 జనవరి 15 వరకు గడువు ఇచ్చింది. కరోనా నేపథ్యంలో వ్యాపారుల అభ్యర్థన మేరకు దీన్ని జూన్ 1 వరకు పెంచింది. అనంతరం జూన్ 15 వరకు పొడగించింది.
ఈ నేపథ్యంలో అసలు గోల్డ్ హాల్‌మార్కింగ్ అంటే ఏంటి? హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలు మాత్రమే అనుమతి ఎందుకు? అనేది ఓసారి పరిశీలిస్తే..
- బంగారం స్వచ్ఛతను ధ్రువీకరించడాన్నే హాల్‌మార్కింగ్ అంటారు.
- 2021 జూన్ 15 నుంచి 14, 18, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు మాత్రమే విక్రయించేందుకు అనుమతి ఉంటుంది.
- ఇప్పటివరకు గోల్డ్ హాల్‌మార్కింగ్ స్వచ్ఛందంగా ఉండేది. ఆభరణాలు కొనే విషయంలో వినియోగదారులు మోసపోకూడదని ఈ హాల్‌మార్కింగ్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది.
- హాల్‌మార్కింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ ద్వారా ఉంటుంది.
- బంగారు ఆభరణాల కోసం హాల్‌మార్కింగ్ స్కీమ్‌ను బీఐఎస్ 2000 ఏప్రిల్ నుంచే నడిపిస్తోంది.
- గడిచిన ఐదేళ్లలో హాల్‌మార్కింగ్ సెంటర్ల సంఖ్య 25 శాతం పెరిగింది.
- 14 కోట్ల ఆభరణాలకు హాల్‌మార్కింగ్ ఇచ్చే సామర్థ్యం ఈ కేంద్రాలకు ఉంది.
- ప్రస్తుతం మొత్తం బంగారు ఆభరణాల్లో 40 శాతానికి హాల్‌మార్కింగ్ ఉంటోంది.
- తక్కువ క్యారెట్ బంగారాన్ని విక్రయించకుండా హాల్‌మార్కింగ్ నిరోధిస్తుంది. బంగారం స్వచ్ఛత వివరాలు ఆభరణాలపై ముద్రిస్తారు కాబట్టి వినియోగదారులకు హాల్‌మార్కింగ్ విధానం ఉపయోగకరంగా ఉంటుంది.
- ప్రస్తుతం దేశంలో 4 లక్షల ఆభరణ తయారీదారులు ఉన్నారు. ఇందులో 35,879 మందికి మాత్రమే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్లో బీఐఎస్ ధ్రువీకరణ ఉంది.
ఇదీ చదవండి: బంగారం కొంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి