సామాజిక మాధ్యమాలు ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ సేవలు శుక్రవారం రాత్రి కొద్దిసేపు నిలిచిపోయాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల తర్వాత సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలిసింది. సందేశాలు పంపించడానికి వీలు కాకపోవడంతో వినియోగదారులు ఇబ్బందుల పాలయ్యారు.
దాదాపు అరగంట తర్వాత.. సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. 45 నిమిషాలు ఓపిగ్గా ఉన్నందుకు వినియోగదారులకు థ్యాంక్స్ చెబుతూ, తిరిగొచ్చామని వాట్సాప్ యాజమాన్యం.. ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
సాంకేతిక సమస్యే కారణమని, యూజర్లకు అసౌకర్యం తలెత్తితే అందుకు క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు ఫేస్‌బుక్ ప్రతినిధి.
ట్విట్టర్లో ట్రెండింగ్..
భారత్ సహా పలు దేశాల్లో సమస్య తలెత్తింది. 3 అప్లికేషన్లకూ ఫేస్‌బుక్ మాతృసంస్థ కావడం, అన్నీ ఒకేసారి ఆగిపోవడం వల్ల యూజర్లు గందరగోళానికి గురయ్యారు.
తమ ఇబ్బందుల్ని.. ట్విట్టర్లో పోస్ట్‌లు చేస్తూ #ఇన్స్టాగ్రామ్డౌన్, #ఫేస్బుక్డౌన్ హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండింగ్ చేశారు.
ఇదీ చదవండి: కరోనా విజృంభణపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ