ఇంధన ధరల పెంపుపై కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం కీలక వివరాలు వెల్లడించారు. గత ఏడేళ్లలో పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు 459శాతం పెరిగాయని తెలిపారు. వంట గ్యాస్ ధరలు రెండితలు అయ్యాయని పేర్కొన్నారు. 2014 మార్చి 1 నాటికి.. 14.2 కేజీల సిలిండర్ ధర రూ.410.5 కాగా ఆ ధర ప్రస్తుతం రూ.819గా ఉందని తెలిపారు. సిలిండర్ ధరలు ఏమేర పెరిగాయ్? చమురుపై సుంకాల వల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం సమకూరింది? అంటూ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో సోమవారం ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాలను వెల్లడించారు.
"ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందుబాటులో ఉన్న కిరోసిన్ ధర మార్చి 2014లో రూ.14.96(లీటరుకు) ఉంటే అది ప్రస్తుతం రూ.35.35కు పెరిగింది. పెట్రోల్‌పై రూ.32.90, డీజిల్‌పై రూ.31.80 ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం విధిస్తోంది. 2018లో పెట్రోల్‌పై రూ.17.98, డీజిల్‌పై రూ.13.83గా ఈ పన్నులుండేవి. అంతర్జాతీయ మార్కెట్ల ధరలకు అనుగుణంగా రేట్లు సవరించే విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో చమురు కంపెనీలు వాటి ధరలు పెంచుతున్నాయి."
-ధర్మేంద్ర ప్రధాన్, పెట్రోలియం మంత్రి
వేల కోట్ల నుంచి లక్షల కోట్లకు..
2013లో పెట్రోల్, డీజిల్‌పై సుంకాల ద్వారా రూ. 52,537 కోట్లు వసూలు చేయగా, 2019-20 మధ్య ఆ మొత్తం రూ. 2.13 లక్షల కోట్లకు చేరిందని మంత్రి వెల్లడించారు. ఈ ఆర్థిక ఏడాదిలో ఆ ఆదాయం రూ. 2.94 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, నేచురల్ గ్యాస్, ముడి చమురుపై సుంకాల ద్వారా వచ్చిన ఆదాయం 2016-17 మధ్య రూ.2.37 లక్షల కోట్లగా ఉందని తెలిపారు. 2020-21 ఏప్రిల్ నుంచి జనవరి మధ్య ఈ ఆదాయం రూ. 3.01 కోట్లకు చేరిందని వెల్లడించారు.
ఇదీ చదవండి : చమురు ధరలపై ఆందోళన- రాజ్యసభ రెండుసార్లు వాయిదా