కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా పసిడి దుకాణాలు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో అక్షయ తృతీయ (ఈనెల 26) నాడు కొనుగోళ్లు 95 శాతం మేర క్షీణించాయని ఆభరణాల పరిశ్రమ సమాఖ్య తెలిపింది. ఆన్‌లైన్‌లో మాత్రమే డిజిటల్ పద్ధతిలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు కొన్ని సంస్థలు వీలు కల్పించాయి. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే, ఈసారి అక్షయతృతీయ సందర్భంగా నామమాత్రంగా 5 శాతం అమ్మకాలు మాత్రమే జరిగాయని పేర్కొంది. దీనికి తోడు పసిడి ధరలు ఏకంగా 52 శాతం పైగా పెరగడం కూడా కొనుగోళ్లు తగ్గడానికి కారణమయ్యాయని పేర్కొంది.
'అక్షయ తృతీయ సమయంలో లాక్‌డౌన్ కొనసాగడంతో అన్ని విక్రయశాలలు మూసి ఉంచారు. దీంతో గత ఏడాదితో పోలిస్తే 5 శాతం విక్రయాలు మాత్రమే ఆన్‌లైన్‌లో జరిగాయి. ప్రజలు ఇప్పటికీ బంగారు ఆభరణాలను క్షుణ్నంగా పరిశీలించుకుని, తమ శరీరంపై అలంకరించుకుని, సంతృప్తి చెందాకే కొనడానికి ఇష్టపడుతున్నారు' అని అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి ఛైర్మన్ అనంత పద్మనాభన్ వెల్లడించారు. ఆభరణాల సరఫరా లాక్‌డౌన్ తర్వాతే సాధ్యమవుతుందని, మే ఆఖరుకు లేదా జూన్‌లో పరిస్థితులు కుదుటపడే అవకాశం ఉందని, దీపావళికి పసిడి గిరాకీ మళ్లీ ఊపందుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:కరోనా సోకకుండా ఏటీఎంలో ఇలా వ్యవహరించండి!