సత్య నాదెళ్ల.. టెక్ ప్రపంచానికి ఈ పేరు ఎంతో సుపరిచితం. అంతేకాదు మరెంతో మందికి ఆయన ఆదర్శం. ఎందుకంటే తన తెలివితేటలు, సామర్థ్యంతో ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ను పటిష్ఠం చేయడంలో కీలక పాత్ర పోషించారాయన.
ఆయన రాసిన 'హిట్ ఫ్రెష్' పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఉద్యోగంలో ఉన్నతస్థానానికి ఎలా ఎదగాలో వివరించారు. చేసే పనితో ప్రేమలో పడితే అనుకున్న కలల ఉద్యోగాన్ని నెరవేర్చుకోవచ్చని స్పష్టం చేశారు.
నిరంతర విద్యార్థిగా...
వ్యక్తి, పుస్తకం, ఆన్లైన్ కోర్సు ఇవన్నీ మనకు ఎన్నో నేర్పిస్తాయని సత్య నాదెళ్ల తెలిపారు.
"ఏ రంగంలోనైనా ఉన్నతస్థానానికి చేరిన వారిని చూస్తే నాకు కొత్త శక్తి వస్తుంది. ఇంతకుముందు నేనెన్నడూ చూడని ఏదో శక్తి నన్ను నడిపిస్తుంది."
- సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ
ఆత్మవిశ్వాసంతో...
ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యంతోనే గొప్ప పనులు సాధ్యమవుతాయని నాదెళ్ల అభిప్రాయపడ్డారు.
"విశ్వాసానికి, గర్వానికి మధ్య ఓ సన్నని గీత ఉంటుంది. నేనెప్పుడూ విశ్వాసంతోనే ఉంటాను." - సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ
పనితో ప్రేమలో పడండి...
చేసే పనిపై తపన, ప్రేమ ఉంటే ఏదీ కష్టంగా అనిపించదని నాదెళ్ల అన్నారు. ఇదే అసలైన ఆలోచనా విధానమని పేర్కొన్నారు.
పని-జీవితం మధ్య సమతుల్యం...
చేసే పని, జీవితం మధ్య పూర్తి అవగాహన ఉండాలని.. ఉపయోగం లేని పని ఎంత చేసినా వ్యర్థమని సత్య నాదెళ్ల వెల్లడించారు.
"మైక్రోసాఫ్ట్‌లో నేను 24 ఏళ్లు ఉన్నాను. ఊరికే పని చేస్తూ పోయి.. దానికి ఎలాంటి అర్థం లేకపోతే మొత్తం వ్యర్థమే." - సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ
స్పష్టమైన ప్రణాళిక...
ఏం సాధించాలనుకుంటున్నామో దానిపై స్పష్టమైన అవగాహన, దృష్టి, ప్రణాళిక ఉండాలని.. దానిపై నిలబడాలని నాదెళ్ల స్పష్టం చేశారు.
"టెక్ రంగంలో ఉన్న అన్ని శాఖల్లోనూ నేను ఉండాలనుకోవడం లేదు. మైక్రోసాఫ్ట్ మాత్రమే ఇవ్వగలిగే వాటిలో నేను ఉంటే చాలు. మనకు అవసరమైన వాటిని గుర్తించడం కూడా విజయానికి అవసరమే." - సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ
ఇదీ చూడండి: ఏజీఆర్ బకాయిలు చెల్లిస్తే.. 3.5 శాతానికి ఆర్థిక లోటు