నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. మొదటి రెండు పారిశ్రామిక విప్లవాలను భారత్ అందుకోలేకపోయిందని, మూడో పారిశ్రామిక విప్లవం లాంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందిపుచ్చుకున్నా రేస్‌లో ఇండియా కొంచెం వెనుకబడే ఉందన్నారు.
టీఎం ఫోరమ్ నిర్వహించిన సదస్సులో రిలయన్స్ జియో ప్రయాణం, భారత డిజిటల్ భవిష్యత్తు అంశంపై ముకేశ్ అంబానీ ప్రసంగించారు.
"నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్ అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే కాకుండా.. ప్రపంచానికి నాయకత్వం అందించే అవకాశం ఉంది. డిజిటల్ కనెక్టివిటీ, క్లౌడ్, ఎడ్జ్ కంప్యూటింగ్, ఐఓటీ, స్మార్ట్ డివైజెస్, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, జెనోమిక్స్.. ఈ నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు నడిపిస్తాయి."
- ముకేశ్ అంబానీ, రిలయన్స్ అధినేత
జియోతో డిజిటల్ విప్లవం..
హైస్పీడ్ కనెక్టివిటీ, తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ అప్లికేషన్లు ఇందులో మూడు అంశాలని, ఇవే భవిష్యత్ పరిష్కారాలుగా ముకేశ్ అంబానీ అభివర్ణించారు.
"జియో రాకముందు భారత్ 2జీకే పరిమితమైంది. జియో దానికి ముగింపు పలికి డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చింది. దేశంలో అత్యంత వేగంగా, అత్యుత్తమ, ప్రపంచ స్థాయి సేవలు అందిస్తోంది జియో. 2జీ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి భారత్‌కు 25 సంవత్సరాలు పడితే, జియో 4జీకి రావడానికి మూడేళ్లు మాత్రమే పట్టింది.
ప్రపంచంలోనే అత్యంత తక్కువ టారిఫ్‌లతో జియో సేవలు అందిస్తోంది. ఇక స్మార్ట్ డివైజెస్ విషయానికి వస్తే జియో రాక ముందు 2జీ ఫీచర్ ఫోన్లు మాత్రమే ఉండేవి. జియో ఫోన్‌తో సంస్థ ఉద్యోగులు ఓ ప్రపంచస్థాయి సౌకర్యాన్ని తక్కువ ధరకే అందించారు. ఒక్క ఏడాదిలోనే జియోఫోన్ 10 కోట్ల మంది భారతీయుల చెంతకు చేరింది."
- ముకేశ్ అంబానీ, రిలయన్స్ అధినేత
డిజిటల్ అప్లికేషన్ల విషయానికి వస్తే జియో తమ కస్టమర్లకు ఖరీదైన కంటెంట్‌ను అందిస్తోందన్నారు అంబానీ. డిజిటల్ కనెక్టివిటీ, డివైజెస్, అప్లికేషన్లను సమ్మిళితం చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయని వివరించారు.
వేగంగా విస్తరణ..
"జియో లాంచ్ చేసిన 170 రోజుల్లోనే కోటి మంది వినియోగదారులు చేరారు. ఇప్పుడు భారత్‌లో నెలవారీ సగటు ఇంటర్నెట్ వినియోగం 600 శాతం పెరిగి 0.2 జీబీ నుంచి 1.2 జీబీకి చేరింది. నాలుగేళ్లలో మొబైల్ డేటా వినియోగంలో 155వ స్థానం నుంచి మొదటి స్థానానికి వచ్చాము. నాలుగో పారిశ్రామిక విప్లవంలో మనం తర్వాతి తరం సాంకేతికతను అభివృద్ధి చేయాల్సి ఉంది" అని అభిప్రాయపడ్డారు ముకేశ్.
ఇదీ చూడండి: 'చార్‌ధామ్'కు ముకేశ్ అంబానీ రూ.5 కోట్ల విరాళం