భారీ రుణభారంతో కార్యకలాపాలు నిలిపేసిన జెట్ ఎయిర్వేస్.. సంస్థ విక్రయం కోసం మరోసారి తాజా బిడ్లను ఆహ్వానించాలని రుణదాతలు యోచిస్తున్నారు. జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు తాజా ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) బిడ్లను ఆహ్వానించనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రుణదాతల కమిటీ పేర్కొంది.
ఈ నెల ఆరంభంలో జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) చేసిన సూచనల మేరకు.. జెట్‌ను అమ్మే ప్రక్రియ వేగవంతం చేయాలని కమిటీ నిర్ణయించింది.
దిగ్గజం నుంచి... దివాలా వరకు!
ఒకప్పుడు దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ విమానయాన సంస్థగా పేరొందిన జెట్ ఎయిర్వేస్.. నిధులు లేక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కార్యకలాపాలు నిలిపేసింది. ప్రస్తుతం దివాలా ప్రక్రియలో ఉంది.
తాజా నిర్ణయంలో భాగంగా ఇప్పటికే ఈ నెల 22న ఈ అహ్వానాలను పంపింది రుణదాతల కమిటీ.
జెట్ఎయిర్వేస్ను కొనుగోలు చేసేందుకు బిడ్ దాఖలు చేసిన ఏకైక సంస్థ సినర్జీ గ్రూప్.. ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టే నిర్ణయానికి మరింత గడువు కోరింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ దివాలా ప్రక్రియ గడువును 90 రోజులకు పెంచింది ఎన్సీఎల్టీ.